Delhi Lieutenant Governor: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు కరోనా పాజిటివ్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన కేజ్రీవాల్
- స్వల్ప లక్షణాలు ఉండటంతో టెస్టు చేయించుకున్నానన్న బైజాల్
- నివాసం నుంచే అన్ని పరిస్థితులను సమీక్షిస్తానని వ్యాఖ్య
- కాంటాక్ట్ లోకి వచ్చిన వారందరూ టెస్టులు చేయించుకోవాలని సూచన
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. స్వల్ప కరోనా లక్షణాలు అనిపించడంతో... తాను కోవిడ్ టెస్టు చేయించుకున్నానని, టెస్టులో పాజిటివ్ అని తేలిందని ట్విట్టర్ ద్వారా ఆయన తెలిపారు. కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే తాను ఐసొలేషన్ లోకి వెళ్లిపోయానని చెప్పారు. తనతో కాంటాక్టులోకి వచ్చిన వారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. ఢిల్లీలోని పరిస్థితులను తాను తన నివాసం నుంచే సమీక్షిస్తానని తెలిపారు.
గత కొన్ని రోజులుగా అనిల్ బైజాల్ ఢిల్లీలోని కరోనా పరిస్థితిపై పలు సమీక్షా సమావేశాలను నిర్వహించారు. మరోవైపు, ఈనెల 19న ఢిల్లీలో లాక్ డౌన్ విధించడానికి ముందు బైజాల్ ను ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కలిశారు. బైజాల్ కరోనా బారిన పడటంతో కేజ్రీవాల్ స్పందిస్తూ... 'మీకు మంచి ఆరోగ్యం ఉండాలని, మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను సార్' అని ట్వీట్ చేశారు.