Soli Sorabjee: కరోనాతో కన్నుమూసిన మాజీ అటార్నీ సోలీ సొరాబ్జి!
- కొంతకాలంగా న్యూఢిల్లీ ఆసుపత్రిలో చికిత్స
- ఈ ఉదయం పరిస్థితి విషమించి కన్నుమూత
- సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులు
కరోనా మహమ్మారి మరో ప్రముఖుడిని బలిగొంది. న్యాయ కోవిదుడు, మాజీ అటార్నీ జనరల్ సోలీ సొరాబ్జీ, వైరస్ సోకి చికిత్స పొందుతూ మరణించారు. ఆయన వయసు 91 సంవత్సరాలు. గత కొన్ని రోజుల నుంచి న్యూఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, ఈ ఉదయం పరిస్థితి విషమించి కన్నుమూశారు. ఆయన మృతి విషయాన్ని తెలుసుకున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు సంతాపాన్ని వెలిబుచ్చారు.
1930లో ముంబైలో జన్మించిన సోలీ సొరాబ్జీ, 1953లో న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించారు. తొలుత బాంబే హైకోర్టులో లాయర్ గా సేవలందించిన ఆయన్ను, 1971లో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా ఆయన్ను గుర్తించారు. ఆపై 1989 నుంచి 90 మధ్య, 1998 నుంచి 2004 వరకూ భారత అటార్నీ జనరల్ గా సేవలందించడంతో పాటు మానహ హక్కుల పరిరక్షణకు తనవంతు కృషి చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆయన్ను 2002లో పద్మ విభూషణ్ తో సత్కరించింది.