Andhra Pradesh: ఏపీకి మూడు రోజుల పాటు వర్ష సూచన
- ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
- దక్షిణాంధ్ర, రాయలసీమలో ఒకటి, రెండు చోట్ల వర్షాలు
- ద్రోణి కారణంగా కురవనున్న వర్షాలు
ఏపీలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్రలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది, దక్షిణాంధ్ర, రాయలసీమల్లో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని చెప్పింది. దక్షిణాది రాష్ట్రాలపై ప్రభావం చూపే ఉత్తర-దక్షిణ ద్రోణి బలహీనపడిందని తెలిపింది.
ప్రస్తుతం సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో పశ్చిమ విదర్భ నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ఈ ద్రోణి విస్తరించి ఉందని పేర్కొంది. మరోవైపు 1.5 కిలోమీటర్ల ఎత్తులో తూర్పు బీహార్ ప్రాంతం నుంచి దక్షిణ తీర ప్రాంతమైన ఒడిశా వరకు వ్యాపించినట్టు తెలిపింది.