Firing: కూకట్ పల్లి హెచ్ డీఎఫ్ సీ ఏటీఎం వద్ద కాల్పులు జరిపి నగదు దోచుకెళ్లిన దుండగులు
- ఏటీఎంలో డబ్బులు నింపుతున్న సిబ్బందిపై కాల్పులు
- బైక్ పై వచ్చిన దుండగులు
- కాల్పులు జరిపి నగదుతో పరారీ
- ఒక సెక్యూరిటీ గార్డు మృతి
- మరొకరి పరిస్థితి విషమం
- ఘటన స్థలిని పరిశీలించిన సజ్జనార్
హైదరాబాదులో ఓ ఏటీఎం వద్ద కాల్పులు జరిపిన దుండగులు పెద్ద మొత్తంలో నగదు దోచుకెళ్లారు. కూకట్ పల్లిలోని హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు ఏటీఎం వద్ద ఈ ఘటన జరిగింది. ఏటీఎంలో డబ్బులు నింపుతున్నవారిపై దుండగులు కాల్పులు జరిపారు. సెక్యూరిటీ గార్డుతో పాటు ఏటీఎం సిబ్బందిపై కాల్పులకు తెగబడ్డారు. అనంతరం నగదుతో పరారయ్యారు.
ఈ ఘటనలో గాయపడిన సెక్యూరిటీ గార్డు అలీ మృతి చెందాడు. అతడి ఉదర భాగంలోకి బుల్లెట్ దూసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఏటీఎం సిబ్బందిలో మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. కాల్పులు జరిగిన స్థలాన్ని సీపీ సజ్జనార్ పరిశీలించారు. సీసీ కెమెరా ఫుటేజి ఆధారంగా పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు షురూ చేశారు. దుండగులు ఓ బైక్ పై వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు గుర్తించారు.
దీనిపై సీపీ సజ్జనార్ మాట్లాడుతూ, దొంగలు రూ.5 లక్షల నగదు ఎత్తుకెళ్లారని వెల్లడించారు. వారు కంట్రీ మేడ్ తుపాకీతో కాల్పులు జరిపారని తెలిపారు. ఘటన స్థలం నుంచి బుల్లెట్ మ్యాగజైన్ స్వాధీనం చేసుకున్నామని, దుండగులు దోపిడీకి పాల్పడిన విధానం చూస్తే పక్కా ప్రొఫెషనల్ తీరులో ఉందని పేర్కొన్నారు.