Rajasthan: సీఎం అశోక్ గెహ్లాట్ కు కరోనా పాజిటివ్.. నిన్ననే ఆయన భార్యకు కూడా నిర్ధారణ!
- ఐసొలేషన్ లో ఉంటూ పని చేస్తానన్న గెహ్లాట్
- కోవిడ్ ప్రొటోకాల్ ను పాటిస్తానని వ్యాఖ్య
- ప్రతి రోజు ఉదయం 8.30 గంటలకు సమీక్షలు నిర్వహిస్తానని వెల్లడి
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కరోనా బారిన పడ్డారు. తనకు పాజిటివ్ అని నిర్ధారణ అయిందని ట్విట్టర్ ద్వారా ఆయన తెలిపారు. తాను చేయించుకున్న కోవిడ్ టెస్టు రిపోర్టు ఈరోజు వచ్చిందని... అందులో పాజిటివ్ అని తేలిందని ఆయన వెల్లడించారు. పాజిటివ్ వచ్చినా... తనకు కరోనా లక్షణాలు లేవని, ప్రస్తుతం బాగున్నానని చెప్పారు. ఐసొలేషన్ లో ఉంటూ పని చేస్తానని... కోవిడ్ నిబంధనలను, జాగ్రత్తలను పాటిస్తానని తెలిపారు. ఈమేరకు హిందీలో ఆయన ట్వీట్ చేశారు. డాక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో ప్రతి రోజు ఉదయం 8.30 గంటలకు సమీక్షా సమావేశాలను నిర్వహిస్తానని చెప్పారు.
అశోక్ గెహ్లాట్ భార్య సునీతా గెహ్లాట్ కు నిన్ననే కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో, వెంటనే ఆయన ఐసొలేషన్ లోకి వెళ్లిపోయారు. మరోవైపు, రాజకీయ నాయకులు పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఎందరో నేతలు వివిధ సమీక్షలు, పర్యవేక్షణలు చేస్తున్నారు. ఆసుపత్రులు, కోవిడ్ సెంటర్లను సందర్శిస్తున్నారు. దీంతో, వారు మహమ్మారి బారిన పడుతున్నారు.