Corona Virus: కరోనాకు సరికొత్త చికిత్స.. ‘నానోట్రాప్’ కణాలతో వైరస్ ఖతం!
- ‘ఏసీఈ2’ రిసెప్టార్ ప్రొటీన్‌లకు అతుక్కునే వైరస్
- ఏసీఈ2 సాంద్రత ఎక్కువగా ఉండే నానో కణాల అభివృద్ధి
- సాధారణ మానవ కణాలుగా పొరబడుతున్న వైరస్
- యాంటీబాడీలు అప్రమత్తమై వైరస్‌ను నిర్వీర్యం చేస్తున్న వైనం
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను ‘నానోట్రాప్’ కణాలతో పనిపట్టే కొత్త చికిత్సా విధానాన్ని అమెరికాలోని షికాగో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ది చేశారు. మానవ కణాలపై ‘ఏసీఈ2’ అనే రిసెప్టార్ ప్రొటీన్‌లకు కరోనా వైరస్ అతుక్కుంటుంది. ఆ తర్వాత అది నెమ్మదిగా కణంలోకి ప్రవేశిస్తుంది. ఈ నేపథ్యంలో వైరస్ కణాల్లోకి చొరబడకుండా అడ్డుకట్ట వేసేందుకు శాస్త్రవేత్తలు ‘ఏసీఈ2’ సాంద్రత ఎక్కువగా ఉండే నానో కణాలను తయారు చేశారు. మరికొన్ని కణాలకు కరోనా యాంటీబాడీలను జత చేశారు. శాస్త్రవేత్తలు చేసిన ఈ సరికొత్త ప్రయోగం విజయవంతమైంది.
‘ఏసీఈ2’లతో కూడిన కణాలను మానవకణాలుగా పొరబడుతున్న వైరస్ వాటినే అతుక్కుంటున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. వైరస్ అతుక్కున్న వెంటనే అప్రమత్తమైన నానో కణాలు రోగ నిరోధక శక్తిని అప్రమత్తం చేయడంతో కొవిడ్ యాంటీబాడీలు వైరస్‌ను నిర్వీర్యం చేస్తాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.