IPL 2021: ఐపీఎల్‌లో పరుగుల కంటే వేగంగా ప్రాణాలు కోల్పోతున్నారు.. టోర్నీ ఆపేయండి: గ్యారీ లినేకర్
- ఐపీఎల్ నిర్వహణను తప్పుబడుతున్న క్రీడా పండితులు, అంతర్జాతీయ మీడియా
- ఐపీఎల్ పవిత్రమైనది, దానిని విమర్శించొద్దంటూ సెటైర్లు
- మానవత్వం కోసమే ఆడుతున్నామన్న బీసీసీఐ ఈమెయిల్‌ను ఎద్దేవా చేసిన మరో పత్రిక
భారత్‌లో కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలను బలిగొంటున్న వేళ ఐపీఎల్ నిర్వహిస్తుండడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు దేశం మొత్తం కరోనాతో అల్లాడిపోతుంటే తీరిగ్గా మ్యాచ్‌లు నిర్వహించడం ఏంటంటూ క్రీడా నిపుణులు సహా మీడియయా సంస్థలు కూడా తప్పుబడుతున్నాయి. తాజాగా, ఇంగ్లండ్ మాజీ ఫుట్‌బాలర్, కామెంటేటర్ గ్యారీ లినేకర్ కూడా ఐపీఎల్ నిర్వహణను తప్పుబట్టాడు. భారత్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఐపీఎల్‌ను నిర్వహించడం పెద్ద తప్పిదమేనని పేర్కొన్నాడు. క్రికెట్‌కు తాను పెద్ద అభిమానినే అయినా ప్రస్తుత ఐపీఎల్ నిర్వహణను సమర్థించలేమన్నాడు. ఐపీఎల్‌లో బ్యాట్స్‌మెన్ తీసే పరుగుల కంటే వేగంగా బయట జనం కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.
గార్డియన్ పత్రిక అయితే ఐపీఎల్‌పై తీవ్ర విమర్శలు చేసింది. కాసులు కురిపించే వాటిని అస్సలు విమర్శించకూడదని, అందులోనూ ఐపీఎల్ అత్యంత పవిత్రమైనదని వ్యంగంగా పేర్కొంది. బీసీసీఐని కార్యదర్శి జై షానే నడిపిస్తున్నారని ఆరోపించింది. మానవత్వం కోసమే ఆడుతున్నామంటూ ఆయా ఫ్రాంచైజీలకు బీసీసీఐ పంపిన ఈమెయిల్‌ను సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ ఎద్దేవా చేసింది. మరోవైపు, ఐపీఎల్‌లో ఆడుతున్న ఇంగ్లండ్ ఆటగాళ్లను వెనక్కి రప్పించాలంటూ క్రికెట్ బోర్డుపై విపరీతమైన ఒత్తిడి ఉందని డెయిలీ మెయిల్ పేర్కొంది.
కాగా, కరోనా భయంతో టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇప్పటికే లీగ్ నుంచి తప్పుకోగా, ముగ్గురు ఆస్ట్రేలియా ఆటగాళ్లు కూడా వెనక్కి మళ్లారు.