SCR: ఇప్పట్లో ఎంఎంటీఎస్ రైళ్లు లేనట్టే... కేంద్రం అనుమతి రాలేదన్న ద.మ.రై!

No MMTS Trains till Center Permits says SCR

  • గత సంవత్సరం నుంచి నిలిచిన ఎంఎంటీఎస్ రైళ్లు
  • హోమ్, ఆరోగ్య శాఖల నుంచి అనుమతి రావాల్సిందే
  • సికింద్రాబాద్ డివిజనల్ మేనేజర్ అభయ్ కుమార్

గ్రేటర్ హైదరాబాద్ ప్రయాణికుల కష్టాలను తీర్చే ఎంఎంటీఎస్ రైళ్లు ఇప్పట్లోకి అందుబాటులోకి వచ్చేలా కనిపించడం లేదు. గత సంవత్సరం లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి ఎంఎంటీఎస్ రైళ్లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే, తాము రైళ్లను నడిపేందుకు సిద్ధంగానే ఉన్నామని, అయితే, కేంద్రం నుంచి అనుమతి లభించిన తరువాత మాత్రమే వాటిని తిప్పుతామని దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది.

ప్రస్తుతం కరోనా కేసులు మరింతగా పెరుగుతున్న నేపథ్యంలో ఆందోళన నెలకొందని, కేంద్ర హోమ్ శాఖతో పాటు ఆరోగ్య శాఖ నుంచి సూచనలు, ఆదేశాల మేరకు మాత్రమే రైళ్ల పునరుద్ధరణ ఉంటుందని సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ అభయ్ కుమార్ స్పష్టం చేశారు.

తాజాగా ఆన్ లైన్ మాధ్యమంగా జరిగిన ఓ సమావేశంలో మాట్లాడిన ఆయన, ప్రస్తుతం డివిజన్ పరిధిలో 140 రైళ్లు నడుస్తున్నాయని, ఉద్యోగులందరూ కొవిడ్ జాగ్రత్తలు తీసుకుంటున్నారని, వారికి వ్యాక్సిన్ వేయించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఉద్యోగులు బయటి ప్రాంతాల్లో తిరిగేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని అన్నారు.

ఇక తమ రైళ్లలో రాజస్థాన్, కర్ణాటక, ఛత్తీస్ గఢ్, ఒడిశా రాష్ట్రాలకు వెళ్లాలంటే, ఆర్టీపీసీఆర్ నెగటివ్ రిపోర్టు తప్పనిసరని, ఆయా రాష్ట్రాల ప్రభుత్వాల ఆదేశాల మేరకు, రైళ్లలో వెళ్లేవారు రిపోర్టులను తీసుకురావాలని కోరారు. గత ఆర్థిక సంవత్సరంలో 96.80 లక్షల మందిని గమ్యస్థానాలకు చేరవేశామని, 6.22 కోట్ల టన్నుల సరకును రవాణా చేశామని అన్నారు. తొలి కిసాన్ రైలును తామే నడిపించామని ఈ సందర్భంగా అభయ్ కుమార్ గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ, వైద్య పరికరాలు, ఆక్సిజన్ తదితరాలను రవాణా చేస్తున్నామని అన్నారు.

  • Loading...

More Telugu News