Narsimha Reddy: యాంకర్ శ్యామల భర్తపై వచ్చిన ఆరోపణల పూర్తి వివరాలు ఇవిగో!

Full details of anchor Shyamala husband Narsimha Reddy case

  • శ్యామల భర్త నర్సింహను అరెస్ట్ చేసిన పోలీసులు
  • నర్సింహతో పాటు మరో మహిళ అరెస్ట్
  • సింధూరారెడ్డి అనే మహిళను మోసం చేశాడంటూ నర్సింహపై ఆరోపణ
  • మీడియాకు వివరాలు తెలిపిన డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్

ప్రముఖ టెలివిజన్ యాంకర్ శ్యామల భర్త నర్సింహారెడ్డి (37)ని హైదరాబాదు రాయదుర్గం పోలీసులు నిన్న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నర్సింహారెడ్డితో పాటు జయంతి గౌడ్ అనే మరో మహిళను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అసలింతకీ నర్సింహారెడ్డిపై వచ్చిన ఆరోపణలు ఏంటంటే... నర్సింహారెడ్డి ఓ టీవీ సీరియల్ నటుడు. యాంకర్ శ్యామలతో ప్రేమ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. వీరు ప్రస్తుతం మసీదుబండ ప్రాంతంలో ఎస్ఎంఆర్ వినయ్ ఐకాన్ వెంచర్ లో నివసిస్తున్నారు.

అయితే, ఖాజాగూడ ప్రాంతంలో నివసించే సింధూరారెడ్డి అనే 31 ఏళ్ల మహిళతో నర్సింహారెడ్డికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాన్ని వ్యాపారంలోకి మళ్లించేందుకు నర్సింహారెడ్డి ప్రయత్నించాడు. తమకు గండిపేటలో 4 ఎకరాల స్థలం ఉందని, దాని విలువ మార్కెట్ ప్రకారం రూ.100 కోట్లు ఉంటుందని సింధూరారెడ్డితో చెప్పాడు. ఆ స్థలంలో ఓ ఎంటర్టయిన్ మెంట్ జోన్ ఏర్పాటు చేస్తే లాభదాయకంగా ఉంటుందని, పెట్టుబడి కావాలని ప్రతిపాదించాడు. దాంతో సింధూరారెడ్డి 2017లో రూ.85 లక్షలను నర్సింహారెడ్డికి ఇచ్చింది.

కానీ ఎంతకీ గండిపేటలో ఎలాంటి నిర్మాణాలు జరపకపోవడంతో ఆమె నర్సింహారెడ్డిని నిలదీసింది. తన డబ్బులు తిరిగిచ్చేయాలని కోరడంతో నర్సింహారెడ్డి ఆమెపై బెదిరింపులకు దిగాడు. అదే సమయంలో మౌలాలి ప్రాంతానికి చెందిన మట్టా జయంతి గౌడ్ రంగంలోకి దిగింది. తాను నర్సింహారెడ్డికి సోదరినని చెప్పుకుంటూ సింధూరారెడ్డిపై వేధింపులు షురూ చేసింది. దాంతో సింధూరారెడ్డి రాయదుర్గం పోలీసులను ఆశ్రయించడంతో, వారు నర్సింహారెడ్డిని, జయంతి గౌడ్ ను అరెస్ట్ చేశారు. ఈ మేరకు రాయదుర్గం పీఎస్ డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ రాజగోపాల్ రెడ్డి మీడియాకు వివరాలు తెలిపారు.

కాగా, నిన్న ఈ అంశంలో శ్యామల స్పందిస్తూ, తన భర్తకు ఏ పాపం తెలియదని, నిజానిజాలు త్వరలోనే వెల్లడవుతాయని తెలిపారు.

  • Loading...

More Telugu News