Sailesh Yadav: ఓ అతిథిలా పెళ్లికి వచ్చి... వధూవరులపై కేసు బుక్ చేసిన కలెక్టర్
- త్రిపురలో ఘటన
- నిబంధనలు పాటించకుండా కల్యాణ మంటపాల్లో వివాహాలు
- స్వయంగా రంగంలోకి దిగిన కలెక్టర్ శైలేష్ యాదవ్
- కల్యాణ మంటపాలపైనా నిషేధం
- చర్యలు తీసుకోలేదంటూ పోలీసు అధికారిపై ఆగ్రహం
కరోనా భూతం జడలు విప్పి నాట్యం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు గుమికూడడంపై ఎక్కడిక్కడ ఆంక్షలు విధిస్తున్నారు. పరిమిత సంఖ్యలో ప్రజలతోనే వేడుకలు జరపుకోవాలని ప్రభుత్వాలు స్పష్టం చేస్తున్నాయి. పలు చోట్ల ఈ నిబంధనలను ఉల్లంఘిస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అయితే త్రిపురలోని ఓ జిల్లా కలెక్టర్ దీన్ని తీవ్రంగా పరిగణించారు. ఆయన పేరు శైలేష్ యాదవ్. ఓవైపు సామాన్య ప్రజలు కరోనా మహమ్మారితో హడలిపోతుంటే ఉన్నతాదాయ వర్గాలు పెళ్లివేడుకలను ఆడంబరంగా, భారీ జనసందోహం నడుమ జరుపుకోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెండు కల్యాణ మంటపాల్లో పెళ్లిళ్లు జరుగుతున్నాయని తెలుసుకున్న కలెక్టర్ శైలేష్ యాదవ్... మొదట తానొక్కడే ఓ అతిథిలా వెళ్లారు. అక్కడ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించడంతో సిబ్బంది సాయంతో చర్యలు తీసుకున్నారు. వధూవరులపైనా, పెళ్లి నిర్వాహకులపైనా కేసులు నమోదు చేశారు. అంతేకాదు, ఇంత జరుగుతున్నా పట్టించుకోలేదంటూ పోలీసు అధికారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. పెళ్లిళ్లకు వేదికగా నిలిచిన రెండు కల్యాణ మంటపాలపైనా డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద రెండేళ్ల పాటు నిషేధం విధించారు. కలెక్టర్ చర్యలకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.