Supreme Court: దేశంలో సంక్షోభం.. నోరు మూసుకుని కూర్చోలేం: కరోనా పరిస్థితులపై సుప్రీం కోర్టు వ్యాఖ్యలు
- హైకోర్టు సుమోటో విచారణలను ఆపలేమని స్పష్టీకరణ
- తమ వంతు సాయం చేస్తామని వెల్లడి
- ఇకపై ప్రతిరోజూ విచారిస్తామన్న అత్యున్నత న్యాయస్థానం
- కరోనా కట్టడికి ఆర్మీ సాయం తీసుకుంటారా? అని ప్రశ్న
- వ్యాక్సిన్ ధరల నియంత్రణ కోసం ఏం చేస్తున్నారని నిలదీత
ప్రస్తుతం కరోనా కల్లోలంతో దేశం సంక్షోభంలో చిక్కుకుందని, ఇలాంటి సంక్షోభ సమయంలో తాము నోరు మూసుకుని కూర్చోలేమని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. కరోనా సంక్షోభంపై స్పందించే హక్కు అన్ని రాష్ట్రాల్లోని హైకోర్టులకు ఉందని, ఆయా హైకోర్టుల చర్యలను తాము అనుసంధానం చేసుకుంటూ పోతామని స్పష్టం చేసింది. కరోనా పరిస్థితులపై సుప్రీం కోర్టు సుమోటో విచారణను చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ విచారణను మంగళవారం జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు, జస్టిస్ రవీంద్ర భట్ లతో కూడిన ధర్మాసనం కొనసాగించింది.
ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టులకు ఉండే అధికారాన్ని తాము నివారించలేమని, కరోనా పరిస్థితులపై ఆయా హైకోర్టులకు తమ వంతు సహకారం అందిస్తామని స్పష్టం చేసింది. హైకోర్టులు పరిష్కరించలేని విషయాల్లో తాము సాయం చేస్తామంది. కాగా, అంతకుముందు సుమోటోగా కేసు విచారణను చేపట్టిన మాజీ సీజేఐ ఎస్ ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం.. కరోనాపై జాతీయస్థాయి ప్రణాళికను వెల్లడించాల్సిందిగా ఆదేశించింది.
ఇప్పటికే ఆ ప్రణాళికను సుప్రీంకోర్టుకు అందజేశామని ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మంగళవారం వెల్లడించారు. దీనిపై మరో రెండు రోజుల్లో విచారణ చేపడతామని సుప్రీం కోర్టు ధర్మాసనం వెల్లడించింది. ప్రతి రోజూ కరోనా పరిస్థితులపై విచారణ చేస్తామని స్పష్టం చేసింది.
ఆర్మీ సేవలు వాడుకుంటారా?
సైన్యం, పారామిలటరీ బలగాలు, రైల్వేలకు చెందిన వైద్య వనరులను ఏమైనా వాడుకునే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికుందా? అని జస్టిస్ రవీంద్ర భట్ ప్రశ్నించారు. క్వారంటైన్, వ్యాక్సినేషన్, బెడ్ల కోసం ప్రస్తుతం ఆర్మీ సాయం తీసుకోవచ్చని, దీనిపై కేంద్ర ప్రణాళిక ఏంటని ఆయన ప్రశ్నించారు. కరోనా టీకాలపై వివిధ సంస్థలు విధించిన ధరలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
టీకాల ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అందరికీ వ్యాక్సిన్లు వేయడమే మేలైన మార్గమని వ్యాఖ్యానించారు. అయితే, వ్యాక్సిన్ల సమీకరణ కోసం ఇప్పటికే సంస్థలతో ధరలపై కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపినట్టు వార్తలు వస్తున్నాయని, అయితే, ఆ చర్చల్లో చెప్పిన ధరకు, ఇప్పుడు సంస్థలు ప్రకటించిన ధరకు తేడా ఉందని జస్టిస్ రవీంద్ర భట్ అన్నారు. దీనిపై ప్రభుత్వం ఏం చేస్తోందని అసహనం వ్యక్తం చేశారు.