India: కరోనాతో అల్లాడుతున్న భారత్.. సంఘీభావంగా బుర్జ్ ఖలీఫాపై త్రివర్ణ పతాక ప్రదర్శన
- ‘స్టే స్ట్రాంగ్ ఇండియా’ అంటూ నినాదం
- కరోనాపై పోరులో భారత్ విజయం సాధిస్తుందన్న యూఏఈ
- వీడియోను షేర్ చేసిన భారత రాయబార కార్యాలయం
కరోనా మహమ్మారితో అల్లాడిపోతున్న భారత్‌కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) సంఘీభావం ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా భవనంపై లేజర్ లైట్లతో త్రివర్ణ పతకాన్ని ప్రదర్శించింది. ‘స్టే స్ట్రాంగ్ ఇండియా’ అనే సందేశాన్ని కూడా దానికి జోడించింది. బుర్జ్ ఖలీఫాపై త్రివర్ణ పతాక ప్రదర్శనకు సంబంధించిన వీడియోను దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయం తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.
బుర్జ్ ఖలీఫా భవనంపై భారత పతాకాన్ని ప్రదర్శించి యూఏఈ సంఘీభావం తెలిపిందని ఇండియన్ ఎంబసీ పేర్కొంది. మరోవైపు, అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ ప్రధాన కార్యాలయంపైనా త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా యూఏఈ విదేశీ వ్యవహరాల శాఖ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ మాట్లాడుతూ.. కరోనాపై పోరులో భారత్ తప్పకుండా విజయం సాధిస్తుందన్న నమ్మకం తమకు ఉందన్నారు.