Sputhnik V: శనివారం నాడు ఇండియాకు రానున్న స్పుత్నిక్- వీ!

First Batch of Sputhnik Vaccine will Reach on May 1
  • దశలవారీగా 5 కోట్ల టీకా డోస్ లు
  • ఇండియాను ఆదుకునేందుకు ముందుంటా
  • ఆర్డీఐఎఫ్ హెడ్ కిరిల్ దిమిత్రీవ్
రష్యాలో తయారైన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్- వీ తొలి బ్యాచ్ మే 1వ తేదీ శనివారం నాడు ఇండియాకు చేరనుంది. ఈ విషయాన్ని వ్యాక్సిన్ తయారీలో భాగమైన రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) హెడ్ కిరిల్ దిమిత్రీవ్ వెల్లడించారు. ఎన్ని వ్యాక్సిన్లను ఎగుమతి చేయనున్నామన్న విషయాన్ని ప్రస్తావించని ఆయన, తొలి బ్యాచ్ గా టీకాలను పంపుతున్నామని, ఆపై వరుసగా వయల్స్ వెళతాయని స్పష్టం చేశారు. రష్యా నుంచి అందే టీకాలు కరోనాపై పోరులోభారత్ కు తోడ్పడతాయని అన్నారు. ఇండియాను ఆదుకునేందుకు తాము పూర్తిగా సహకరిస్తామని అన్నారు.

ఇండియాలో కరోనాను నియంత్రించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ, అవసరమైన వైద్య పరికరాలు, ఔషదాలను పంపేందుకు బ్రిటన్, జర్మనీ, యూఎస్ వంటి దేశాలు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇక రష్యన్ సంస్థ, ప్రపంచవ్యాప్తంగా స్పుత్నిక్- వీ ని మార్కెటింగ్ చేస్తున్న ఆర్డీఐఎఫ్, ఇండియాలోని ఐదు కంపెనీలతో ఇప్పటికే టీకా తయారీ దిశగా డీల్స్ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా డాక్టర్ రెడ్డీస్ సహా పలు కంపెనీలు, ఏడాదికి 85 కోట్ల స్పుత్నిక్ వి డోస్ లను తయారు చేయనున్నాయి.

కాగా, మరో నెల రోజుల వ్యవధిలో 5 కోట్ల వరకూ స్పుత్నిక్- వీ డోస్ లు ఇండియాకు అందించాలని ఆర్డీఐఎఫ్ ఇప్పటికే నిర్ణయించింది. ఇవి దశలవారీగా ఇండియాకు చేరనున్నాయి. ఇక రష్యా ఫార్మా సంస్థ ఫార్మసీ ఎన్ టెజ్, ఇండియాకు 10 లక్షల ప్యాక్ ల రెమిడెసివిర్ ను సరఫరా చేస్తామని, ఇందుకోసం రష్యా ప్రభుత్వాన్ని అనుమతి కోరామని పేర్కొంది.

Sputhnik V
Russia
India
First Batch

More Telugu News