Corona Virus: కరోనా కట్టడికి ఏ కఠిన నిర్ణయమైనా మే 2 తరువాతనే!

Health Emergency in India After May 2
  • హెల్త్ ఎమర్జెన్సీ విధించే అవకాశం
  • అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ తరువాతనే నిర్ణయం
  • మల్లగుల్లాలు పడుతున్న కేంద్ర ప్రభుత్వం
  • న్యాయ నిపుణులతో సంప్రదింపులు
ఇండియాలో రోజుకు మూడున్నర లక్షలకు పైగా కరోనా కేసులు వస్తున్న వేళ, పరిస్థితిని అదుపు చేసేందుకు దేశవ్యాప్తంగా ఆరోగ్య అత్యయిక స్థితిని విధించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. హెల్త్ ఎమర్జెన్సీని విధిస్తే, కరోనా నియంత్రణకు సంబంధించిన చర్యలపై ఎటువంటి నిర్ణయమైనా తీసుకునే అధికారం కేంద్రం పరిధిలోకి వెళుతుంది. అయితే, ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, అది మే 2 తరువాత మాత్రమేనని సమాచారం.

పశ్చిమ బెంగాల్ లో మరో విడత ఎన్నికలు జరగాల్సి వుండటం, ఆపై 2వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియ ముగిసిన తరువాతే హెల్త్ ఎమర్జెన్సీపై నిర్ణయం తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఆక్సిజన్ సరఫరా, అత్యవసర ఔషధాల పంపిణీ, కరోనాపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై కొరడా విధించడం తదితరాలన్నింటినీ, తమ అధీనంలోకి తీసుకునే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇప్పటికిప్పుడు ఎమర్జెన్సీ విధించే విషయంలో మల్లగుల్లాలు పడుతున్న కేంద్ర పెద్దలు, మరో వారం రోజుల తరువాత తుది నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది.

కాగా, వాస్తవానికి భారత రాజ్యాంగంలో నేషనల్ ఎమర్జెన్సీ, ఆర్థిక ఎమర్జెన్సీల ప్రస్తావన ఉందే తప్ప, ఆరోగ్య ఎమర్జెన్సీ గురించిన ప్రస్తావన లేదు. అయితే, ఈ దిశగా నిర్ణయం తీసుకోవాలంటే, ఏ చట్టాలను వినియోగించుకోవచ్చన్న విషయంపై కేంద్ర పెద్దలు న్యాయ నిపుణులతో సంప్రదింపులు చేస్తున్నారు. రాజ్యాంగంలోని 355వ అధికరణ కింద కరోనా కారణంతో ప్రజల్లో తలెత్తిన భయాందోళనలు తొలగించేందుకు, చట్టాలను ధిక్కరించే వారిని అణచి వేసేందుకు, అంతర్గత కల్లోలాలను రూపుమాపే అవకాశం కోసం ఆర్టికల్ 355ను వాడుకునేందుకు వీలుంది.

ఇదే నిబంధనలను అనుసరించి హెల్త్ ఎమర్జెన్సీ విధించాలని కేంద్రం యోచిస్తున్నట్టు సమాచారం. అదే జరిగితే భావ ప్రకటనా స్వేచ్ఛపై ఆంక్షలు విధించబడతాయి. సామాజిక మాధ్యమాల్లో కేంద్రానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానించడాన్ని నేరంగా పరిగణిస్తారు. మీడియాలో సైతం వ్యతిరేక వార్తలు రాయడానికి వీలుండదు. ఇందుకు జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించే అవకాశాలు కూడా ఉంటాయి.

Corona Virus
Health Emergency
May 2
India

More Telugu News