Revanth Reddy: ప్రధాని మోదీ మనదేశానికి ఓ టూరిస్ట్ మాత్రమే: రేవంత్ రెడ్డి
- వరంగల్ లో రేవంత్ రెడ్డి మీడియా సమావేశం
- కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు టీఆర్ఎస్, బీజేపీ కుట్ర అని ఆరోపణ
- మోదీ విదేశాల్లోనే ఎక్కువగా గడుపుతుంటారని వ్యాఖ్యలు
- అడపాదడపా దేశానికి వస్తుంటారని వెల్లడి
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి వరంగల్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రధాని మోదీ మన దేశానికి ఒక టూరిస్ట్ మాత్రమేనని అభివర్ణించారు. మోదీ మన దేశంలో ఎన్నిరోజులు ఉన్నారో లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. విదేశాల్లో ఎక్కువగా గడుపుతూ, అడపాదడపా దేశానికి వస్తుంటాడని ఎద్దేవా చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వస్తున్న మంత్రులు కేసీఆర్ పాలన అద్భుతం అంటున్నారని మండిపడ్డారు.
పాములను ఆడించే వాళ్లు పాము, ముంగిస పోరు ఏర్పాటు చేసి ప్రజల వద్ద చిల్లర అంతా లాగేసుకుని, చివరికి ఏమీ తేల్చకుండానే వెళ్లిపోతారని... ఇప్పుడు బీజేపీ వాళ్లు చేస్తున్నది కూడా అదేనని అన్నారు. దుబ్బాకలోనూ, జీహెచ్ఎంసీలోనూ బీజేపీ ఆ విధమైన వైఖరినే అనుసరించిందని ఆరోపించారు. వరంగల్ కు ఎంతో చరిత్ర ఉందని, రాష్ట్ర పునర్విభజన చట్టంలో కోచ్ ఫ్యాక్టరీ ఉండడం కాంగ్రెస్ కృషేనని తెలిపారు. కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు బీజేపీ, టీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.