Akshay Kumar: గౌతమ్ గంభీర్ ఫౌండేషన్ కు రూ.1 కోటి విరాళం ప్రకటించిన అక్షయ్ కుమార్
- కరోనా బాధితులకు సేవలందిస్తున్న గంభీర్ ఫౌండేషన్
- అక్షయ్ ఆర్థికసాయం
- బాధితులను ఆదుకుంటామన్న గంభీర్
- ఆహారం, మందులు, ఆక్సిజన్ సమకూర్చుతామని వెల్లడి
గతేడాది కరోనా కష్టకాలంలో పీఎం కేర్స్ ఫండ్ కు రూ.25 కోట్ల విరాళం అందించిన బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ మరోసారి తన దాతృత్వ గుణాన్ని ప్రదర్శించారు. మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ స్థాపించిన స్వచ్ఛంద సేవా సంస్థ గౌతమ్ గంభీర్ ఫౌండేషన్ కు అక్షయ్ కుమార్ రూ.1 కోటి విరాళం ప్రకటించారు. ప్రస్తుతం గౌతమ్ గంభీర్ ఫౌండేషన్ దేశ రాజధాని ఢిల్లీలో కొవిడ్ బాధితులకు ఆపన్నహస్తం అందిస్తోంది.
అక్షయ్ కుమార్ పెద్దమనసుతో స్పందించడం పట్ల గౌతమ్ గంభీర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కష్టకాలంలో ప్రతి సాయం కూడా ఓ ఆశాకిరణం అని పేర్కొన్నారు. అక్షయ్ ప్రకటించిన ఆర్థికసాయంతో కరోనా బాధితులకు ఆహారం, ఔషధాలు, ఆక్సిజన్ సమకూర్చుతామని గంభీర్ వివరించారు.
దీనిపై అక్షయ్ కుమార్ ప్రతిస్పందిస్తూ... దేశంలో అత్యంత క్లిష్ట పరిస్థితులు ఏర్పడ్డాయని, తాను ఒకరికి సాయపడే పరిస్థితిలో ఉన్నందుకు సంతోషిస్తున్నానని వెల్లడించారు. అందరం ఈ సంక్షోభం నుంచి త్వరలోనే బయటపడదామని ఆశిద్దాం అంటూ అక్షయ్ కుమార్ పిలుపునిచ్చారు.