Cheating: పాత రూ.5 నోటుపై ట్రాక్టర్ బొమ్మ ఉంటే లక్షలు మీవేనంటూ నిలువు దోపిడీ!
- నర్సింహులు అనే వ్యక్తికి ఫోన్ కాల్
- ఐదు నోటుపై ట్రాక్టర్ బొమ్మ ఉంటే రూ.11 లక్షలిస్తామని వెల్లడి
- నిజమేనని నమ్మిన నర్సింహులు
- పలు దఫాలుగా రూ.8.35 లక్షలు మోసగాళ్లకు సమర్పణ
- బహుమతి దక్కకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు
అమాయకంగా నమ్మేవాళ్లు ఉన్నంత కాలం మోసగాళ్ల హవా నడుస్తూనే ఉంటుంది. తెలంగాణలో ఓ వ్యక్తిని మోసగాళ్లు పాత రూ.5 నోటుతో బుట్టలో వేసి లక్షలు నొక్కేశారు. పాత రూ.5 నోటుపై ట్రాక్టర్ బొమ్మ ఉంటే లక్షలు మీ సొంతం అవుతాయంటూ ఎరవేసి ఓ వ్యక్తి నుంచి రూ.8 లక్షలకు పైగా టోకరా వేశారు.
కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన కస్తూరి నర్సింహులు అనే వ్యక్తికి ఇటీవల ఓ ఫోన్ కాల్ వచ్చింది. పాత రూ.5 నోటుపై ట్రాక్టర్ బొమ్మ ఉంటే రూ.11.74 లక్షలు వస్తాయని అవతలి వ్యక్తులు నమ్మబలికారు. అది నిజమేనని నమ్మిన నర్సింహులు వారు చెప్పిన విధంగా రూ.8.35 లక్షలు అనేక పర్యాయాలు జమ చేశాడు. ఓసారి ఖాతా తెరవాలని, మరోసారి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కోసం అని, ఇంకోసారి ఐటీ క్లియరెన్స్ కోసం అని... ఇలా 10 దఫాలు అతడి నుంచి అవతలి వ్యక్తులు డబ్బు రాబట్టారు.
ఎంతకీ తనకు రావాల్సిన లక్షలు రాకపోవడంతో కస్తూరి నర్సింహులు తాను మోసపోయానని అర్థం చేసుకున్నాడు. తనకు వచ్చిన ఫోన్ కాల్ ఆధారంగా దేవునిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. ఆ ఫోన్ కాల్ పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చినట్టు గుర్తించిన పోలీసులు, ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు.