Amaravati: ఈ నెల 30తో అమరావతి ఉద్యమానికి 500 రోజులు.. లక్షమందితో సభ

Amaravati JAC decided to conduct meeting with one lakh people

  • నేటితో 494వ రోజుకు చేరుకున్న అమరావతి ఉద్యమం
  • వర్చువల్ విధానంలో భారీ సభ నిర్వహణకు జేఏసీ నిర్ణయం
  • జాతీయ పార్టీల నాయకులు, న్యాయకోవిదులకు ఆహ్వానం

ఏపీ రాజధాని అమరావతిని తరలించవద్దంటూ రైతులు చేపట్టిన ఉద్యమం ఈ నెల 30తో 500వ రోజుకు చేరుకోనుంది. ఈ నేపథ్యంలో ఆ రోజున లక్షమందితో వర్చువల్ విధానంలో భారీ సభ నిర్వహించాలని రాజధాని జేఏసీ నేతలు నిర్ణయించారు. సమావేశంలో పాల్గొనే వారందరూ కరోనా నిబంధనలు తప్పకుండా పాటించేలా  చర్యలు తీసుకోనున్నారు. అలాగే, ప్రతి దీక్షా శిబిరంలో రైతులు, మహిళలు, రైతు కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నారు.

ఈ సభకు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన జాతీయ నేతలు, న్యాయకోవిదులు, సామాజిక కార్యకర్తలు, కుల సంఘాలు, వర్తక, వాణిజ్య సంఘాల నాయకులను ఆహ్వానించాలని నిన్న నిర్వహించిన సమావేశంలో జేఏసీ నేతలు నిర్ణయించారు. కాగా, మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన నిరసనలు నేటితో 494వ రోజుకు చేరుకున్నాయి. వివిధ ప్రాంతాల్లోని దీక్షా శిబిరాల్లో నిరసనలు కొనసాగాయి.

  • Loading...

More Telugu News