Central Govt: ప్రజల ప్రాణాలపై ప్రభుత్వానికి ఏమాత్రం పట్టింపు లేదు: కేంద్రంపై ఢిల్లీ హైకోర్టు ఫైర్‌

Delhi High Court once again fires on central govt
  • ఆక్సిజన్‌ కొరతపై విచారణ జరిపిన కోర్టు
  • కేంద్రంపై తీవ్రంగా మండిపడ్డ న్యాయస్థానం
  • నిన్నటి నుంచి ఏం చేస్తున్నారని నిలదీత
  • ప్రజల ప్రాణాల్ని కాపాడేందుకు ఎంతదూరమైనా వెళ్లాలని హితవు
  • అవసరమైతే పరిశ్రమల ఆక్సిజన్‌ మొత్తాన్ని తరలించాలని సూచన
ఆక్సిజన్‌ కొరతపై ఈరోజు ఢిల్లీ హైకోర్టులో వాడీవేడి వాదనలు నడిచాయి. న్యాయస్థానం మరోసారి కేంద్రానికి మొట్టికాయలు వేసింది. నిన్నటి ఆదేశాలు ఇప్పటికీ అమల్లోకి రాకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఒక రోజు మొత్తం ఏం చేశారని నిలదీసింది. ప్రజల జీవించే హక్కును కాలరాసే అధికారం ప్రభుత్వానికి లేదని వ్యాఖ్యానించింది. ఆక్సిజన్‌ను అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని స్పష్టం చేసింది.

‘‘ఆక్సిజన్‌ కొరత విషయంలో ప్రభుత్వం వాస్తవికతను ఎలా విస్మరిస్తుంది? ఆక్సిజన్ లేని కారణంగా మరణాలు సంభవించకూడదు. ఇలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తాయంటే.. ప్రజల ప్రాణాలపై సర్కార్‌కు ఏమాత్రం పట్టింపు లేనట్టే’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మ్యాక్స్‌ హాస్పిటల్స్ వేసిన పిటిషన్‌ను విచారిస్తూ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. వ్యాజ్యంపై కేంద్రం విస్మయం వ్యక్తం చేయగా.. కోర్టు మొట్టికాయలు వేసింది.

‘‘పిటిషన్‌ను చూసి ఆశ్చర్యపోవద్దు. మీకు క్షేత్రస్థాయి పరిస్థితులు తెలిసి ఉండాలి. పెట్రోలియం, ఉక్కు పరిశ్రమలు ఆక్సిజన్‌ను ఇంకా వినియోగించుకుంటున్నాయని నిన్ననే చెప్పాం. ఏం చేశారు?’’ అని కోర్టు ప్రశ్నించింది. దీనిపై కేంద్ర ఆరోగ్యశాఖ స్పందిస్తూ.. ఈ విషయంపై దస్త్రాలు కదులుతున్నాయని తెలిపింది.

 ఈ సమాధానంపై కోర్టు మరోసారి తీవ్రస్థాయిలో మండిపడింది. ‘‘మరి ఫలితం ఏంటి? దస్త్రాల కదలికలు మాకు అనవసరం. పరిశ్రమలు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వం అధీనంలో పెట్రోలియం కంపెనీలున్నాయి. వాయుసేన ఉంది. నిన్న మేం అనేక ఆదేశాలు ఇచ్చాం. ఈరోజంతా ఏం చేశారు?’’ అని కోర్టు కేంద్రాన్ని నిలదీసింది.

సరిపడా ఆక్సిజన్‌ అందుబాటులో ఉండేలా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని కోర్టు స్పష్టం చేసింది. ఏదైనా చేసి పౌరుల జీవించే హక్కును కాపాడాలని ఆదేశించింది. అవసరమైతే పరిశ్రమల్లో ఉన్న ఆక్సిజన్‌ మొత్తాన్ని మెడికల్‌ ఆక్సిజన్‌గా మార్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
Central Govt
Corona Virus
Oxygen
Delhi
High Court

More Telugu News