Jagan: 6,27,906 మంది రైతులకు వడ్డీ రాయితీని జమ చేసిన సీఎం జగన్
- రుణాలు తీసుకుని, తిరిగి చెల్లించిన రైతులకు వడ్డీ రాయితీ అందించాం
- మా ప్రభుత్వానికి రైతులు, రైతు కూలీలే ముఖ్యం
- గత ప్రభుత్వ హయాంలోని బకాయిలను కూడా చెల్లించాం
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఇప్పటి వరకు 6 లక్షల మందికి పైగా రైతులకు వడ్డీ రాయితీని అందించామని చెప్పారు. గత రబీ సీజన్ లో లక్ష రూపాయల వరకు పంట రుణాలు తీసుకుని, ఏడాదిలోపు తిరిగి చెల్లించిన 6,27,906 మంది రైతులకు వడ్డీ రాయితీని అందించామని తెలిపారు. ఈరోజు జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి రూ. 128.47 కోట్లను బటన్ నొక్కి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, ప్రపంచంలో 60 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వానికి రైతులు, రైతు కూలీలు చాలా ముఖ్యమని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలోని బకాయిలను కూడా చెల్లించామని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎంతో మేలు జరుగుతోందని అన్నారు. వచ్చే నెలలో మరో విడత రైతు భరోసా సాయాన్ని అందిస్తామని చెప్పారు.