Telangana: కరోనాతో ఆసుపత్రి పాలైన తల్లిదండ్రులు.. మనస్తాపంతో కుమారుడి ఆత్మహత్య

Parents infected to corona son suicide
  • తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటన
  • అమ్మానాన్నలను జాగ్రత్తగా చూసుకోవాలంటూ లేఖ
  • తనకు రావాల్సిన ఆస్తిని మేనల్లుళ్లకు ఇవ్వాలని కోరిక
తల్లిదండ్రులకు కరోనా సోకడంతో తట్టుకోలేకపోయిన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిందీ ఘటన. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌కు చెందిన పెడగ మల్లేశం (41) రాజన్న సిరిసిల్ల జిల్లా మరిమడ్ల గురుకుల పాఠశాలలో కాంట్రాక్ట్ పద్ధతిలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఎల్లారెడ్డిపేటలో అద్దె ఇంట్లో ఉంటూ అప్పుడప్పుడు ఇంటికి వెళ్లి వస్తుండేవాడు.

ఇటీవల కరోనా బారినపడిన ఆయన తల్లిదండ్రులు కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో తల్లి పరిస్థితి విషమంగా మారడంతో మల్లేశం తట్టుకోలేకపోయాడు. రెండు రోజుల క్రితం స్వగ్రామానికి వెళ్లి తిరిగి వచ్చిన మల్లేశం తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. స్నానాలగదిలోకి వెళ్లి పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.  ఈ సందర్భంగా మల్లేశం రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. జీవితంపై విరక్తితోనే చనిపోతున్నట్టు అందులో రాసుకొచ్చాడు. పెద్దక్క, చిన్నక్క, చెల్లెలు, బావలు అందరూ మంచివారేనని, అమ్మానాన్నలను జాగ్రత్తగా చూసుకోవాలని కోరాడు.

ఇక తనకు రావాల్సిన ఆస్తిని మేనల్లుళ్లు అయిన శ్రీకాంత్, సన్నీకి రాసివ్వాలని కోరాడు. తన 22 ఏళ్ల గురుకుల ప్రయాణంలో ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించాలన్న మల్లేశం.. ‘మిత్రులందరికీ నమస్కారం’ అని లేఖను ముగించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Telangana
Rajanna Sircilla District
Corona Virus
Suicide

More Telugu News