VK Singh: తన సోదరుడికి బెడ్ ఏర్పాటు చేయాలంటూ కేంద్రమంత్రి ట్వీట్.. శివసేన ఎంపీ ఆసక్తికర కామెంట్!

VK Singh Tweet Sparks Questions On Health System
  • ప్రియాంక చతుర్వేది ట్వీట్‌కు కేంద్రమంత్రి వివరణ
  • ఆయన తన సోదరుడు కాదంటూ మరో ట్వీట్
  • తొలుత చేసిన ట్వీట్ డిలీట్
తన సోదరుడికి కరోనా సోకిందని, ఆసుపత్రిలో అతడికి ఓ పడకను ఏర్పాటు చేయాలని ఘజియాబాద్ అధికారులకు విజ్ఞప్తి చేస్తూ కేంద్రమంత్రి వీకే సింగ్ చేసిన ట్వీట్ వైరల్ అయింది. మంత్రి తన ట్వీట్‌కు ఘజియాబాద్ జిల్లా కలెక్టర్‌ను ట్యాగ్ చేశారు. ఆసుపత్రిలో బెడ్ కేటాయించాలంటూ స్వయంగా కేంద్రమంత్రి చేసిన ట్వీట్ కాసేపటికే వైరల్ అయింది.

శివసేన నాయకురాలు, ఎంపీ ప్రియాంక చతుర్వేది మంత్రి ట్వీట్‌పై స్పందిస్తూ ఆసుపత్రిలో ఓ బెడ్ కోసం సాక్షాత్తూ ఓ మంత్రే ఇలా ట్వీట్ చేయడం ఆయన నిస్సహాయతకు అద్దం పడుతోందంటూ ట్వీట్ చేశారు. కరోనా సోకిన ఆ వ్యక్తి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ప్రియాంక చతుర్వేది ట్వీట్‌పై స్పందించిన వీకే సింగ్.. నిజానికి ఆయన తన సోదరుడేమీ కాదని, తన నియోజకవర్గ పరిధిలోని ఓ వ్యక్తి అని వివరణ ఇచ్చారు. అధికారులు వేగంగా స్పందిస్తారన్న ఉద్దేశంతోనే తాను ఆ ట్వీట్ చేసినట్టు చెప్పుకొచ్చారు. మానవతా దృక్పథంతోనే అలా ట్వీట్ చేసినట్టు పేర్కొన్న ఆయన వైద్య సాయం అందించాలంటూ చేసిన ట్వీట్‌ను తొలగించారు.
VK Singh
Tweet
Corona Virus
Ghaziabad
Shiv Sena
MP Priyanka Chaturvedi

More Telugu News