Niti Aayog: కరోనా రెండో వేవ్‌తో ఆర్థిక వ్యవస్థలో తీవ్ర అనిశ్చితి!
- వెల్లడించిన నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్
- తగు చర్యలు చేపట్టేందుకు కేంద్రం సిద్ధం
- కొత్త వేరియంట్ల వల్లే దయనీయ స్థితి
- అయినప్పటికీ.. 11 శాతం వృద్ధి రేటు
దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతి నేపథ్యంలో పెట్టుబడులు, వినియోగం విషయంలో తీవ్రమైన అనిశ్చితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ తెలిపారు. అయితే, అవసరమైనప్పుడు కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని భరోసానిచ్చారు.
రెండో దశ కరోనా సేవారంగం వంటి వాటిపై నేరుగా ప్రభావం చూపడంతో పాటు.. మొత్తం ఆర్థిక వ్యవస్ధలో అనిశ్చితిని పెంచుతుందని రాజీవ్ కుమార్ తెలిపారు. భారత్‌లో కరోనా ఓ దశలో పూర్తిగా అంతరించిపోయే దశకు చేరుకుందని.. కానీ, యూకే సహా ఇతర దేశాల నుంచి వచ్చిన వేరియంట్ల వల్ల పరిస్థితి మరోసారి దయనీయంగా మారిందని వివరించారు.
మునుపటితో పోలిస్తే కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నా.. ఈ ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 11 శాతంగా నమోదవుతుందని రాజీవ్ కుమార్ అంచనా వేశారు. ఆర్థిక వ్యవస్థపై రెండో దఫా విజృంభణ ప్రత్యక్ష, పరోక్ష ప్రభావాన్ని కేంద్ర ఆర్థిక శాఖ అంచనా వేసిన తర్వాతే మరోసారి ఉద్దీపన చర్యలపై ఓ అంచనాకు రాగలమని తెలిపారు.