Peddireddi Ramachandra Reddy: నువ్వు మంత్రివా... నీకు మంత్రి పదవి అవసరమా?: పెద్దిరెడ్డిపై అయ్యన్న పాత్రుడు ఫైర్
- ముగిసిన తిరుపతి ఉప ఎన్నిక
- దొంగ ఓట్లు వేశారంటూ టీడీపీ ఆరోపణ
- మంత్రి పెద్దిరెడ్డి దగ్గరుండీ మరీ దొంగ ఓట్లు వేయించారన్న అయ్యన్న
- పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిందని వ్యాఖ్యలు
తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ సరళిపై స్పందించిన టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తిరుపతిలో పోలింగ్ జరిగిన తీరు చూసి దేశమంతా విస్తుపోయిందని అన్నారు. మంత్రి హోదాలో ఉన్న పెద్దిరెడ్డి దగ్గరుండి మరీ దొంగ ఓట్లు వేయించారని ఆరోపించారు. దొంగ ఓటర్లను బస్సుల్లో తరలిస్తుంటే పోలీసులు ఏంచేస్తున్నారన్న అయ్యన్న.... డీజీపీ గౌతమ్ సవాంగ్ నేతృత్వంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిందని విమర్శించారు.
"రాష్ట్ర పంచాయతీ రాజ్ మంత్రి హోదాలో ఉన్న పెద్దిరెడ్డి వేలమందిని తన కల్యాణ మండపంలో ఉంచి, వారికి పలావులు పెట్టి, డబ్బులు ఇచ్చి, వారి పేర్లతో దొంగ ఓటరు కార్డులు కొట్టించి ఓట్లు వేయించారు. పనికిమాలిన వాళ్లు కూడా ఇంత తప్పుడు పనులు చేయరయ్యా... దొంగ ఓట్లు వేయించే నువ్వు మంత్రివా? మంత్రి హోదాలో ఉంటూ ఇలాంటి తప్పుడు పనులు చేస్తుంటే నీకు మంత్రి పదవి అవసరమా? బస్సుల్లో ఉన్న ప్రజలే తమను ఎవరు తరలించారో చెబుతుంటే పోలీసు వ్యవస్థ ఏంచేస్తోంది? ఒకప్పుడు ఏపీ పోలీసులకు దేశంలో ఎంతో గౌరవం ఉండేది. డీజీపీ గౌతమ్ సవాంగ్ వచ్చాక అది పోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే బానిసల్లా పనిచేస్తున్నారు" అంటూ అయ్యన్న వ్యాఖ్యలు చేశారు.