AB Venkateswara Rao: వివేకా హత్యకేసులో సీబీఐకి ఏబీ వెంకటేశ్వరరావు లేఖ... మండిపడిన ఏపీ పోలీసు విభాగం
- ఏపీలో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకా హత్య
- సీబీఐకి లేఖ రాసిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్
- లేఖలో పోలీసు అధికారులపై ఆరోపణలు!
- ఏబీ ఆరోపణలను ఖండించిన డీఐజీ పాలరాజు
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య వ్యవహారంపై ఏపీ ఇంటెలిజన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ఇటీవల సీబీఐకి లేఖ రాయడం తెలిసిందే. ఏబీ వెంకటేశ్వరరావు తన లేఖలో ఏపీ డీజీపీ, ఇతర పోలీసు అధికారులపై వ్యాఖ్యలు చేశారంటూ ఏపీ పోలీసు విభాగం స్పందించింది. డీజీపీపై ఏబీ వెంకటేశ్వరరావు నిరాధార ఆరోపణలు చేశారని డీఐజీ పాలరాజు పేర్కొన్నారు. గతంలో వివేకా హత్య కేసును ఏబీ పర్యవేక్షించారని, మరి అప్పుడే కీలక సమాచారాన్ని సిట్ కు ఎందుకు అందివ్వలేదని ప్రశ్నించారు.
ఈ కేసులో జగన్ కుటుంబ సభ్యులు, బంధువుల అరెస్టుకు ఏబీ ఒత్తిడి తెచ్చింది నిజం కాదా? దర్యాప్తు అధికారి రాహుల్ దేవ్ శర్మపై ఏబీ ఒత్తిడి తీసుకురాలేదా? అని పాలరాజు ప్రశ్నించారు. అయితే రాహుల్ దేవ్ శర్మ ఈ కేసులో ఏబీ ఒత్తిళ్లకు తలొగ్గలేదని వెల్లడించారు. ఈ కేసులో కృత్రిమ డాక్యుమెంట్లు సృష్టించారని ఏబీ ఆరోపిస్తున్నారని, ఆ ఆరోపణల్లో నిజంలేదని అన్నారు. సహచర అధికారులపై ఏబీ ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు. ఏబీ సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, డీజీ హోదా కలిగిన వ్యక్తి ఈ విధమైన ప్రవర్తన కనబర్చడం తగదని అన్నారు.