Chattisgarh: ఛత్తీస్ గఢ్ లోని ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. ఐదుగురు కరోనా పేషెంట్లు ఆహుతి
- ఐసీయూలో చెలరేగిన మంటలు
- వేరే ఆసుపత్రికి పేషెంట్ల తరలింపు
- మంటలార్పేందుకు 2 గంటల సమయం
- రూ.4 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం
ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ లోని రాజధాని ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించి ఐదుగురు కరోనా పేషెంట్లు మరణించారు. శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో ఆసుపత్రి మొదటి అంతస్తులోని ఐసీయూలో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఆసుపత్రిలో 34 మంది పేషెంట్లున్నారని, తొమ్మిది మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారని అధికారులు చెప్పారు.
ఐసీయూలో చికిత్స పొందుతున్న ఐదుగురు కరోనా పేషెంట్లు అగ్ని కీలలకు ఆహుతయ్యారని చెప్పారు. మంటలను అదుపు చేయడానికి రెండు గంటలు పట్టిందన్నారు. ఆసుపత్రిలోని రోగులను వేరే ఆసుపత్రికి తరలించామని తెలిపారు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని పోలీస్ అధికారి తారకేశ్వర్ పటేల్ చెప్పారు.
కాగా, ప్రమాదంలో మృతి చెందిన వారికి రూ.4 లక్షల పరిహారాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ సింగ్ బాఘల్ ప్రకటించారు. బాధిత కుటుంబసభ్యులకు అన్ని విధాలుగా సాయమందించాలని బాఘల్ ను కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కోరారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు.