Public Exams: ఏపీలో పబ్లిక్ పరీక్షలు జరుపుతామనో, రద్దు చేస్తామనో ఇప్పటికిప్పుడు చెప్పలేం: మంత్రి ఆదిమూలపు సురేశ్
- ఏపీలో భారీగా కరోనా కేసులు
- విద్యాసంస్థల మూసివేతపై ఎటూ తేల్చుకోలేకపోతున్న సర్కారు
- పరీక్షల నిర్వహణపైనా అనిశ్చితి
- పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ సిద్ధంగానే ఉందన్న మంత్రి
- సీఎం జగన్ తుది నిర్ణయం తీసుకుంటారని స్పష్టీకరణ
ఏపీలో కరోనా కేసులు నిత్యం వేల సంఖ్యలో నమోదవుతున్నా, మరణాల సంఖ్య క్రమేపీ పెరుగుతున్నా రాష్ట్ర సర్కారు విద్యాసంస్థల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదంటూ విమర్శలు వస్తున్నాయి. దీనిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వివరణ ఇచ్చారు.
గత జూన్ లోనూ ఇలాంటి పరిస్థితే వచ్చినప్పుడు పరిస్థితిని నిశితంగా పరిశీలించి నిర్ణయం తీసుకున్నామని, ఇప్పుడు కూడా తాము పరిస్థితిని గమనిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత తమకు అత్యంత ప్రాధాన్యతా అంశమని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పాఠశాలలు కరోనా హాట్ స్పాట్లుగా మారుతున్నాయన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు.
రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైందన్న సంకేతాలు గత వారం, పది రోజుల నుంచే వస్తున్నాయని, దాంతో తాము అప్రమత్తం అయ్యామని వెల్లడించారు. ప్రతి స్కూల్లోనూ నమూనాలు సేకరిస్తున్నామని, ఇప్పటివరకు 10 లక్షల మంది విద్యార్థులకు కరోనా టెస్టులు జరిపామని తెలిపారు. ఈ విద్యాసంవత్సరాన్ని నష్టపోరాదన్న ఉద్దేశంతోనే తాము పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని స్పష్టం చేశారు. ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోందని అన్నారు.
అయితే తాము సంసిద్ధత వ్యక్తం చేసినంత మాత్రాన ప్రభుత్వ నిర్ణయం ఇదేనని చెప్పలేమని, వాస్తవ పరిస్థితులను పరిశీలించి సీఎం జగన్ తుది నిర్ణయం తీసుకుంటారని మంత్రి వెల్లడించారు. ఇప్పటికే ఇంటర్ ప్రాక్టికల్స్ చేపట్టి, థియరీ పరీక్షల దిశగా అడుగులు వేస్తున్నామని, కానీ వాస్తవ పరిస్థితి భిన్నంగానే కనిపిస్తోందని పేర్కొన్నారు. అందుకే ఆచితూచి వ్యవహరిస్తున్నామని స్పష్టం చేశారు. పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తామనో, రద్దు చేస్తామనో ఇప్పటికిప్పుడే చెప్పలేమని అభిప్రాయపడ్డారు.
విద్యాసంస్థల్లో కరోనా కేసులు పెరుగుతున్నది నిజమేనని, అయితే అవేమీ వందల సంఖ్యలో కాదని, కేవలం పదుల సంఖ్యలోనే నమోదవుతున్నాయని వివరణ ఇచ్చారు. కరోనా సోకిన వారిని వెంటనే ఐసోలేషన్ కు తరలిస్తూ, వైద్య చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు.
దేశంలో కరోనా వ్యాప్తి విపరీతంగా పెరిగిపోవడంతో సీబీఎస్ఈ టెన్త్ క్లాస్ పరీక్షలు రద్దయ్యాయి. అటు తెలంగాణలోనూ పది, ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు చేసి, ఇంటర్ సెకండియర్ పరీక్షలు వాయిదా వేశారు. కొవిడ్ మహమ్మారితో తల్లడిల్లిపోతున్న అనేక రాష్ట్రాలు ఇప్పటికే విద్యాసంస్థలు మూసివేశాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపైనా క్రమంగా ఒత్తిడి పెరుగుతోంది.