Tirupati: తిరుపతి, నాగార్జున సాగర్ లో మొదలైన పోలింగ్!
- 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్
- తిరుపతిలో 28 మంది అభ్యర్థులు
- సాగర్ లో 41 మంది
- సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు
ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతితో పాటు, తెలంగాణలోని నాగార్జున సాగర్ లో ఈ ఉదయం ఉప ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద కరోనా నిబంధనలను పక్కాగా పాటించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. తిరుపతి లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ మొదలైంది. నెల్లూరు జిల్లా పరిధిలో నాలుగు, చిత్తూరు జిల్లా పరిధిలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే.
మొత్తం 2,470 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు, 17.10 లక్షల మందికి పైగా ఓటర్లకు ఓటేసే అవకాశాన్ని కల్పించారు. 28 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. 27 కంపెనీల కేంద్ర బలగాలను, మూడు కంపెనీల ప్రత్యేక దళాలను తిరుపతి సెగ్మెంట్ నిమిత్తం కేటాయించారు.
మొత్తం 877 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించిన అధికారులు, అదనపు కేంద్ర బలగాలను మోహరించారు. తొలిసారిగా ఈ ఎన్నికల్లో 80 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించగా, ఇంతవరకూ 608 మంది ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు.
ఇక నాగార్జున సాగర్ అసెంబ్లీ ఎన్నిక విషయానికి వస్తే, మొత్తం 41 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్యే పోటీ జరుగనుంది. మొత్తం 2.20 లక్షల మందికి పైగా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రెండు నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ పోలింగ్ జరుగనుండగా, మే 2న ఓట్ల లెక్కింపు జరుగనుంది.