PremRathod: ఆంక్షల వేళ నడిరోడ్డుపై యువతి డ్యాన్స్... కేసు పెట్టిన పోలీసులు!
- గుజరాత్ లోని రాజ్ కోట్ లో ఘటన
- రాత్రి 11 గంటల వేళ యువతి డ్యాన్స్
- ప్రేమ్ రాథోడ్ పై కేసు రిజిస్టర్
కరోనా మహమ్మారి విజృంభిస్తూ, ప్రమాద ఘంటికలను మోగిస్తున్న వేళ, పలు రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. ప్రజలపై క్రమంగా నిబంధనలు, ఆంక్షలు పెరుగుతున్నాయి. అధికారులు సైతం కఠినంగా ఆంక్షలను అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గుజరాత్ కు చెందిన ఓ యువతి, తన అత్యుత్సాహంతో కర్ఫ్యూ సమయంలో నడిరోడ్డుపై డ్యాన్స్ చేసి చిక్కుల్లో పడింది. సామాజిక మాధ్యమాల్లో తన అభిమానుల కోసం ఆమె చేసిన ఈ వీడియో కారణంగా, ఆమె ఇప్పుడు పోలీసు కేసులను ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఈ ఘటన రాజ్ కోట్ లో జరిగింది. ప్రిషా రాథోడ్ అనే యువతి ఈవెంట్ మేనేజ్ మెంట్ జాబ్ లో ఉంటూ, సోషల్ మీడియాలో తన వీడియోలు పోస్ట్ చేస్తూ, పేరు తెచ్చుకుంది. అంతవరకూ బాగానే ఉంది. అయితే, తానో వీడియోను మరింత వినూత్నంగా చేయాలని భావించిన ఆమె, రాత్రి 11 గంటల సమయంలో ఓ ఇంగ్లీష్ పాటకు నడిరోడ్డుపై డ్యాన్స్ చేస్తూ, ఆ వీడియోను పోస్ట్ చేసింది. మాస్క్ ధరించి ఆమె రోడ్డుపై ఓ ఆంగ్ల గీతానికి నృత్యం చేసింది.
దీంతో ఆమె వీడియో వైరల్ కాగా, పలువురు ఆమె నిబంధనలను ఉల్లంఘించిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆమెపై కేసు పెట్టారు. అయితే, తాను ఆ వీడియోను డిలీట్ చేశానని, అప్పటికే పలువురు దాన్ని షేర్ చేయండంతోనే అది వైరల్ అయిందని ఆమె వివరణ ఇచ్చినా, పోలీసులు తమ పనిని తాము చేసుకుని వెళ్లారు. కర్ఫ్యూ విధించిన వేళ, నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ కేసు పెట్టారు. ఇటువంటి తుంటరి పనులు చేస్తే, చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు కరోనాను నియంత్రించేందుకు ప్రభుత్వం ఆదేశించిన నిబంధనలన్నీ పాటించాల్సిందేనని పేర్కొన్నారు.