Andhra Pradesh: అమూల్ తో ఒప్పందం వల్ల మహిళలకు స్వయం ఉపాధి: ఏపీ సీఎం జగన్
- సంస్థ లాభాలను రైతుకే చెల్లిస్తుందని వెల్లడి
- దాని వల్ల రైతులకు ఎంతో లాభమన్న సీఎం
- అమూల్ ప్రాజెక్ట్ పై సమీక్ష
- గుంటూరులో ‘అమూల్ పాల వెల్లువ’కు శ్రీకారం
పాల సేకరణకు అమూల్ తో కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా మహిళలకు స్వయం ఉపాధి దొరుకుతుందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన అమూల్ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం గుంటూరు జిల్లాలో ‘అమూల్ పాల వెల్లువ’ ప్రాజెక్టును ఆన్ లైన్ ద్వారా ప్రారంభించారు. రాష్ట్రంలో పాడి పరిశ్రమ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అమూల్ తో ఒప్పందం చేసుకున్నామని ఆయన అన్నారు.
ఇప్పటికే 400 గ్రామాల్లో అమూల్ ద్వారా పాలను సేకరిస్తున్నామని, గుంటూరు జిల్లాలో 180 గ్రామాల్లో పాలను సేకరిస్తామని జగన్ వివరించారు. త్వరలోనే చిత్తూరు జిల్లాలోని మరో 170 గ్రామాల్లోనూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. అమూల్ ఓ సహకార సంస్థ అని, అందులో అక్కాచెల్లెమ్మలే వాటాదారులని చెప్పుకొచ్చారు. లాభాల్లో వాటాను తిరిగి రైతులకే అమూల్ చెల్లిస్తోందని, దాని వల్ల రైతుకు ఎంతో లాభసాటి అవుతుందని ఆయన పేర్కొన్నారు.