Bajaz: కొత్త హంగులతో తిరిగొచ్చిన బజాజ్ చేతక్... 48 గంటల్లోనే అడ్వాన్స్ బుకింగ్ బంద్!

Chetak Electric Bookings Suspended by Bajaz Amid Over Response in Bookings

  • 1990వ దశకం వరకూ ఓ వెలుగు వెలిగిన చేతక్
  • ఆపై ఇప్పుడు ఎలక్ట్రిక్ వేరియంట్ లో విడుదల
  • ధర రూ. 1.26 లక్షలైనా కొనుగోలుకు క్యూ

బజాజ్ చేతక్ స్కూటర్... 1970 నుంచి 1990వ దశకం వరకూ ఇండియాలో ఓ వెలుగు వెలిగిందంటే సందేహం లేదు. బజాజ్ ఆటో నుంచి వచ్చిన ఈ స్కూటర్ అమ్మకాలు ఓ దశలో ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో జరిగేవి. ఆ తరువాత ప్రజల అభిరుచి మారి, వీటి కొనుగోళ్లపై ఆనాసక్తిని చూపించడంతో క్రమంగా వాటి విక్రయాలు మందగించి, మొత్తానికే ఉత్పత్తి నిలిచిపోయింది.

ఇప్పుడు అదే స్కూటర్ కు కొత్త హంగులను జోడించి, ఎలక్ట్రిక్ వేరియంట్ గా తయారు చేసి, మార్కెట్లోకి విడుదల చేయనున్నామని ఈ సంవత్సరం ఆరంభంలో బజాజ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలను ప్రారంభిస్తూ, అడ్వాన్స్ బుకింగ్స్ ను ఈ నెల 13న సంస్థ ప్రారంభించింది.

రెండు వేరియంట్లలో స్కూటర్ విడుదల కాగా, ప్రీమియమ్ ధరను రూ. 1.26 లక్షలుగా, అర్బేన్ ధరను రూ. 1.22 లక్షలుగా ( ఆన్ రోడ్ ధర - పూణె) సంస్థ నిర్ణయించింది. అయితే, తొలి విడతలో సంస్థ డెలివరీ చేయాలని భావించిన స్కూటర్ యూనిట్ల సంఖ్యతో పోలిస్తే, అధికంగా బుకింగ్స్ 48 గంటల వ్యవధిలోనే వచ్చాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో సంస్థ వాటి బుకింగ్స్ ను ఆపేసింది.

కస్టమర్ల నుంచి అద్భుత స్పందన వచ్చిందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించిన సంస్థ ఈడీ రాకేశ్ శర్మ, ఈ స్పందన తమకెంతో ఆనందాన్ని కలిగించిందని అన్నారు. పూణె, బెంగళూరు నగరాల్లో మాత్రమే తాము బుకింగ్స్ ఓపెన్ చేశామని, సాధ్యమైనంత త్వరలోనే బుక్ చేసుకున్న కస్టమర్లకు వాహనాలను అందిస్తామని స్పష్టం చేశారు. బుకింగ్స్ ను నిలిపివేయాలని తీసుకున్న నిర్ణయం తనను బాధించిందని అన్నారు. స్కూటర్ ప్రొడక్షన్ ను మరింతగా పెంచుతామని స్పష్టం చేశారు. మరో మూడు నెలల్లోగా వీరందరికీ చేతక్ స్కూటర్లను అందిస్తామని అన్నారు.

కాగా, ఈ స్కూటర్ 3.8 కిలోవాట్ పవర్ తో పని చేస్తుంది. 16.2 ఎన్ఎం పీక్ టార్క్, 1,400 ఆర్పీఎంను అందిస్తుంది. గంటకు 70 కిలోమీటర్ల వరకూ వేగంతో వెళుతూ, ఒకసారి చార్జింగ్ తో 80 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇప్పటికి రెండు నగరాలకే అందుబాటులో ఉన్నా, వచ్చే సంవత్సరం నాటికి దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ అమ్మకాలు ప్రారంభిస్తామని రాకేశ్ శర్మ వెల్లడించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News