Adimulapu Suresh: టీడీపీలో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోంది: మంత్రి ఆదిమూలపు
- తిరుపతి ఉప ఎన్నికపై ఆదిమూలపు వ్యాఖ్యలు
- వైసీపీదే విజయం అని ధీమా
- విపక్షాలు రెండు, మూడు స్థానాల కోసం పోటీపడాలని ఎద్దేవా
- టీడీపీ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని వెల్లడి
ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ మాజీ సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు, లోకేశ్ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని, వారి డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారని విమర్శించారు. అమ్మ ఒడి పథకంలో ఇచ్చే డబ్బు అయ్య బుడ్డికి వాడుతున్నారంటూ నోటికొచ్చిన విమర్శలు చేస్తున్నాడంటూ చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం తాగండి... ఆపై టీడీపీకే ఓటు వేయండి అంటూ మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.
టీడీపీలో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోందని, అందుకే ప్రజలను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి ఆదిమూలపు ఆరోపించారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడే రాష్ట్రంలో పార్టీ పనైపోయిందని వ్యాఖ్యానించాడని, ఆ వీడియో ఫేక్ అని చంద్రబాబు, లోకేశ్ ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. ఏపీలో టీడీపీ లేదంటూ అచ్చెన్న అంటుంటే, లోకేశ్ మాత్రం సవాళ్లు విసురుతున్నాడని ఎద్దేవా చేశారు.
ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా తిరుపతి బరిలో వైసీపీదే విజయం అని... రెండు, మూడు స్థానాల కోసమే విపక్షాలు పోటీ పడాల్సి ఉంటుందని అన్నారు. తిరుపతి ఓటర్లు ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారని, వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తికి 5 లక్షల మెజారిటీ వస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.