BJP Leaders: వైసీపీ అభ్యర్థి గురుమూర్తి పోటీకి అనర్హుడు: సీఈసీకి ఫిర్యాదు చేసిన ఏపీ బీజేపీ నేతలు
- తిరుపతిలో ఈ నెల 17న ఉప ఎన్నిక
- వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తి
- గురుమూర్తి అన్యమతస్తుడంటున్న బీజేపీ నేతలు
- ఆధారాలు సీఈసీకి సమర్పించామని జీవీఎల్ వెల్లడి
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఏపీ బీజేపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. వర్చువల్ విధానంలో వారు తమ ఫిర్యాదును సీఈసీకి నివేదించారు. తిరుపతి బరిలో పోలింగ్ భద్రత, తదితర అంశాలపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. వాలంటీర్లను రాజకీయ లబ్దికి వినియోగిస్తున్నారని బీజేపీ బృందం తన ఫిర్యాదులో పేర్కొంది.
దీనిపై రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పందిస్తూ... వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి పోటీకి అనర్హుడని సీఈసీకి వివరించామని వెల్లడించారు. గురుమూర్తి అన్యమతానికి చెందిన వ్యక్తి అనేందుకు తగిన ఆధారాలను అందజేశామని చెప్పారు. గురుమూర్తి అనర్హత అంశంపై విచారణ జరపాలని కోరామని జీవీఎల్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరామని అన్నారు. తిరుపతిలో ఈ నెల 17న ఉప ఎన్నిక పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే.