Maharashtra: మహారాష్ట్రలో భారీగా తగ్గిన కొత్త కరోనా కేసులు!
- లాక్ డౌన్ నిబంధనలు కఠినతరం
- దాదాపు 10 శాతానికి పైగా తగ్గిన కొత్త యాక్టివ్ కేసులు
- పెండింగ్ నమూనాలను క్లియర్ చేయాలన్న అధికారులు
కరోనా వీర విజృంభణ చేస్తున్న మహారాష్ట్రలో, లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయడం ప్రారంభమైన తరువాత, తొలిసారిగా సోమవారం నాడు కొత్త కేసులు గణనీయంగా తగ్గాయి. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 51,751 కొత్త కేసులు వచ్చాయి. ఆదివారం నాడు రాష్ట్రంలో 65 వేలకు పైగా కేసులు వచ్చిన సంగతి తెలిసిందే. నిన్న 258 మంది వైరస్ కారణంగా మరణించారని అధికారులు వెల్లడించారు. ఇక ముంబై మహా నగరంలోని కొత్త కేసులు సైతం ఒక్క రోజు వ్యవధిలో 9,989 నుంచి 6,893కు తగ్గాయి.
అయితే, గడచిన వారాంతంలో కరోనా పరీక్షల సంఖ్యను తగ్గించారని, అందువల్లే కేసులు తగ్గాయని కొంతమంది ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై మహారాష్ట్ర ఆరోగ్య శాఖ స్పందించాల్సి వుంది. ఇక ముంబై బీఎంసీ గణాంకాల ప్రకారం, సగటు పరీక్షలతో పోలిస్తే 20 శాతం తక్కువగా 39,398 పరీక్షలు నిర్వహించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకూ మహారాష్ట్రలో 5.64 లక్షలకు పైగా యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. రోజువారీ కేసులను పరిశీలిస్తే, కొత్త కేసుల లోడ్ సోమవారం నాడు 10.5 శాతం తగ్గింది. గత వారాంతపు రికవరీల తరువాత, కొత్త యాక్టివ్ కేసుల సంఖ్య 63 వేల నుంచి 55 వేలకు తగ్గాయి.
ముంబైలో యాక్టివ్ కేసుల సంఖ్య 86,279గా ఉండగా, దాదాపు 20 వేల మందికి పైగా వివిధ ఆసుపత్రులు, కొవిడ్ కేర్ సెంటర్లలో చికిత్సను పొందుతున్నారు. మిగతా వారు సెల్ఫ్ క్వారంటైన్, హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. సోమవారం వచ్చిన కేసుల్లో ఐసీయూ సపోర్ట్ కావాల్సిన కేసులు 1,272గా ఉందని అధికారులు వెల్లడించారు.
కాగా, గత వారాంతంలో లాక్ డౌన్ నిబంధనలను అమలు చేసిన కారణంగానే సరాసరి టెస్టుల సంఖ్య తగ్గిందని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో ల్యాబొరేటరీల వద్ద పెండింగ్ లో ఉన్న నమూనాలను క్లియర్ చేయాలని ఆదేశించామని పేర్కొన్నారు.