Justice Eshwaraiah: జస్టిస్ ఈశ్వరయ్య కేసులో ఏపీ హైకోర్టు దర్యాప్తుకు ఆదేశించకుండా ఉండాల్సింది: సుప్రీంకోర్టు
- జస్టిస్ ఈశ్వరయ్య, జడ్జి రామకృష్ణల మధ్య ఫోన్ సంభాషణ కేసు
- దర్యాప్తు అవసరం లేదన్న సుప్రీంకోర్టు
- కేసు మెరిట్ పై వ్యాఖ్యలు చేయబోమన్న సుప్రీం
మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య ఫోన్ సంభాషణ కేసులో ఏపీ హైకోర్టు ఆదేశించిన దర్యాప్తు అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. ఈ కేసులో దర్యాప్తుకు హైకోర్టు ఆదేశించకుండా ఉండాల్సిందని వ్యాఖ్యానించింది. కేసు మెరిట్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదని తెలిపింది. ఈ మేరకు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సుభాష్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది. హైకోర్టులో దాఖలైన పిల్స్ మెరిట్స్ జోలికి తాము వెళ్లబోమని తెలిపింది.
జస్టిస్ ఈశ్వరయ్య, సస్పెండైన మున్సిఫ్ మేజిస్ట్రేట్ రామకృష్ణల మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై కుట్రకు పథకం పన్నినట్టు స్పష్టమవుతున్నందున... వాస్తవాలను నిర్ధారించేందుకు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఆర్వీ రవీంద్రన్ తో విచారణ కమిటీని ఏర్పాటు చేస్తూ గతంలో హైకోర్టు తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఉత్తర్వులపై స్టే కోరుతూ, జస్టిస్ ఈశ్వరయ్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈశ్వరయ్య పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది.