KTR: ఏబీవీపీ కార్యకర్తల నిరసనలు.. ఉద్రిక్త‌త‌ల న‌డుమ తెలంగాణ మంత్రి కేటీఆర్ వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న‌

ktr visits warangal in tense situation
  • వ‌రంగ‌ల్ న‌గ‌రంలో ప‌లు కార్య‌క్ర‌మాలకు ప్రారంభోత్స‌వం
  • కేటీఆర్ కాన్వాయ్‌ని అడ్డుకున్న ఏబీవీపీ కార్య‌క‌ర్త‌లు
  • అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఉద్రిక్త‌త‌ల న‌డుమ తెలంగాణ మంత్రి కేటీఆర్ గ్రేట‌ర్‌ వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న కొన‌సాగుతోంది. కేటీఆర్‌ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు ఏబీవీపీ కార్య‌క‌ర్త‌లు ప‌లుసార్లు ప్ర‌య‌త్నించారు. పోచమ్మకుంట వద్దకు కేటీఆర్‌ కాన్వాయ్ రాగానే దానికి అడ్డుగా ఏబీవీపీ కార్య‌క‌ర్త‌లు వెళ్లారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి సునీల్‌ కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

దీంతో పోలీసులు ఏబీవీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మ‌రో ప్రాంతంలోనూ కేటీఆర్ కాన్వాయ్‌ని ఏబీవీపీ కార్య‌క‌ర్త‌లు అడ్డుకునే ప్ర‌య‌త్నం చేయ‌గా వారిని పోలీసులు అదుపుచేశారు. నిర‌స‌న‌ల మ‌ధ్యే కేటీఆర్ ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. త్వ‌ర‌లో గ్రేటర్‌ వరంగల్‌ ఎన్నికలు జ‌ర‌గ‌నున్న నేపథ్యంలో ఆయ‌న ప‌ర్య‌ట‌న ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

మిషన్‌ భగీరథలో భాగంగా వరంగల్‌ నగర వాసులకు తాగు నీరు అందించే కార్యక్రమాన్ని ఈ సంద‌ర్భంగా కేటీఆర్‌ ప్రారంభించారు. తాగునీటి కోసం ఎనిమిది లక్షల లీటర్ల సామర్థ్యంతో ట్యాంకు నిర్మాణాన్ని చేపట్టారు. దాని కోసం రూ.939 కోట్లు ఖ‌ర్చు చేశారు. అలాగే, పలు అభివృద్ధి పనులను కేటీఆర్ ప్రారంభిస్తున్నారు.
KTR
TRS
Warangal Rural District
Warangal Urban District

More Telugu News