Andhra Pradesh: అవన్నీ ప్రశాంత్ కిశోర్ నాటకాల్లో భాగమే: బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి
- శ్రీవారి పాదల చెంత చెబుతున్నా వివేకా హత్యతో నాకు సంబంధం లేదు
- నాలుగు గంటల్లోనే గుండెపోటు హత్య ఎలా అయింది?
- కోడికత్తి శ్రీనివాసరావు ఇప్పుడు వైసీపీ కార్యకర్తగా ఎలా మారాడు?
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తన ప్రమేయం లేదని బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి పునరుద్ఘాటించారు. తిరుపతిలో విలేకరులతో మాట్లాడిన ఆయన వివేకా హత్య కేసులో తన ప్రమేయం లేదని శ్రీవారి పాదాల చెంత మరోమారు చెబుతున్నానన్నారు. వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయినట్టు చెప్పిన జగన్ కుటుంబ సభ్యులు నాలుగు గంటల తర్వాత మాటమార్చి హత్యగా పేర్కొన్నారని ఆరోపించారు.
అయినా, ఆయన మృతదేహాన్ని కడగడం ఏంటని ప్రశ్నించారు. మృతదేహానికి కుట్లు ఎందుకు వేశారని నిలదీశారు. అసలు అవినాష్‌రెడ్డి నోరెందుకు విప్పడం లేదని ప్రశ్నించారు. అప్పుడు సిట్ దర్యాప్తు వద్దన్న జగన్ ఇప్పుడు సీబీఐ దర్యాప్తు అవసరం లేదని ఎందుకు అంటున్నారని ఆదినారాయణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
వివేకానందరెడ్డి హత్య, కోడికత్తి కేసుల్లో డ్రామాలు ప్రశాంత్ కిశోర్ నాటకాల్లో భాగమేనని అన్నారు. కోడికత్తి శ్రీనివాసరావు ఇప్పుడు వైసీపీ కండువా కప్పుకుని కార్యకర్తగా తిరగడం డ్రామా కాదా? అని ధ్వజమెత్తారు.
రాష్ట్రం మొత్తం అవినీతి మయంగా మారిపోయిందని, హింస, దౌర్జన్యాలు, దాడులు రాష్ట్రంలో పరాకాష్టకు చేరుకున్నాయని జగన్ అరాచక పాలనకు రోజులు దగ్గరపడ్డాయని ఆదినారాయణరెడ్డి హెచ్చరించారు.