Prashant Kishor: తృణమూల్ సొంత సర్వేలోనూ బీజేపీదే విజయం: ప్రశాంత్ కిశోర్ ఆడియో టేప్ లీక్!
- మమతా బెనర్జీతో చాటింగ్ బట్టబయలు
- తన మాటలను ఎడిట్ చేశారన్న ప్రశాంత్ కిశోర్
- మొత్తం చాటింగ్ ను విడుదల చేయాలని డిమాండ్
తృణమూల్ కాంగ్రెస్ కు వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ప్రశాంత్ కిశోర్ మాట్లాడినట్టుగా వున్న ఆడియో క్లిప్ ఒకటి ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఈ క్లిప్ ను బీజేపీ నేత అమిత్ మాలవ్యా తొలిసారిగా తన ట్విట్టర్ ఖాతాలో వెలుగులోకి తెచ్చారు. పశ్చిమ బెంగాల్ లో బీజేపీ విజయం ఖాయమని ప్రశాంత్ కిశోర్ అంటున్నట్టుగా ఇందులో వినిపిస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చేసిన అంతర్గత సర్వేలోనూ ఇదే విషయం వెల్లడైందని ఆయన అన్నారు. ఈ విషయాన్ని క్లబ్ హౌస్ వద్ద జరిగిన బహిరంగ సభ సమయంలో సీఎం మమతా బెనర్జీ కూడా అంగీకరించినట్టు తనకు తెలిసిందని మాలవ్యా తన ట్వీట్ లో పేర్కొన్నారు. ప్రశాంత్ కిశోర్, మమతా బెనర్జీల మధ్య వీడియో చాట్ రూపంలో ఈ సంభాషణ జరిగినట్టు తెలుస్తోంది.
బెంగాల్ లో అధికార పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, దళితులతో పాటు తప్పిలి, మాతురా వర్గాలు కూడా బీజేపీ వైపు నిలిచారని అమిత్ వ్యాఖ్యానించారు. తన ఆడియో లీక్ అవుతుందన్న సంగతి ప్రశాంత్ కిశోర్ కు తెలియదని, దాదాపు రెండు దశాబ్దాల తరువాత ముస్లింలు టీఎంసీతో పాటు కాంగ్రెస్, వామపక్షాలకు వ్యతిరేకంగా ఉన్నారని అన్నారు.
ఇక ఈ లీక్ లపై ప్రశాంత్ కిశోర్ స్పందించారు. తన క్లబ్ హౌస్ చాట్ లో కొంత భాగాన్ని మాత్రమే వారు తీసుకుని, ఎడిట్ చేసి విడుదల చేశారని, మొత్తం తమ సంభాషణ ఏంటన్న విషయాన్ని వారు విడుదల చేస్తే బాగుంటుందని వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక ఈ ట్వీట్ దేశవ్యాప్తంగా వైరల్ అయింది. దీన్ని 45 వేల మంది రీ ట్వీట్ చేయగా, ఆపై ప్రశాంత్ చేసిన ట్వీట్ కు 11 వేల రీట్వీట్లు వచ్చాయి.