Alibaba: అలీబాబాపై మరోసారి బుసలు కొట్టిన డ్రాగన్... 2.78 బిలియన్ డాలర్ల జరిమానా!

China market regulatory imposes huge fine over Alibaba

  • గతంలో చైనా ఆర్థిక విధానాలపై జాక్ మా వ్యాఖ్యలు
  • అప్పటినుంచి బ్లాక్ లిస్టులో జాక్ మా
  • అలీబాబా కార్యకలాపాలపై డ్రాగన్ నిఘా
  • అనేక ఒప్పందాలపై చర్యలు

చైనా ప్రభుత్వ ఆర్థిక విధానాలపై అసంతృప్తిని వెళ్లగక్కిన అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నాడు. తాజాగా అలీబాబా సంస్థపై చైనా మార్కెట్ నియంత్రణ సంస్థ 2.78 బిలియన్ డాలర్ల మేర అతి భారీ జరిమానా విధించింది.

తమ గ్రూప్ కు చెందిన ఈకామర్స్ పోర్టళ్లలో ఉత్పత్తులను విక్రయించాలనుకునే వ్యాపారులు తమతోనే కొనసాగాలని, తమ ప్రత్యర్థి ఈకామర్స్ పోర్టళ్లతో ఒప్పందాలు కుదుర్చుకోకూడదని అలీబాబా యాజమాన్యం ఒత్తిడి తెస్తోందన్న అంశంపై చైనా మార్కెట్ రెగ్యులేటరీ విచారణ జరిపింది. గత డిసెంబరులో ప్రారంభమైన విచారణ ఇటీవలే ముగిసింది. తాజాగా జరిమానాను ఖరారు చేశారు. అలీబాబా గ్రూప్ 2019లో జరిపిన 455.7 బిలియన్ యువాన్ల వ్యాపారంలో 4 శాతం జరిమానాగా చెల్లించాలని రెగ్యులేటరీ స్పష్టం చేసింది.

చైనా ప్రభుత్వ రంగ బ్యాంకులు తాకట్టు దుకాణాల మనస్తత్వాలను వీడాలని గతంలో జాక్ మా వ్యాఖ్యానించగా, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చైనా అధినాయకత్వం అప్పటినుంచి పగబట్టిన తాచులా జాక్ మాను వెంటాడుతోంది. ఆయన సంస్థలకు చెందిన అనేక వ్యాపార ఒప్పందాలను కార్యరూపం దాల్చకుండా అడ్డుకుంది. ఆయన సంస్థలపై తీవ్రస్థాయిలో ఆంక్షలు విధించింది.

దాంతో జాక్ మా కుబేరుల జాబితా నుంచి కిందికిపడిపోవడమే కాదు, అసలు బాహ్య ప్రపంచానికి కనిపించకుండా కొన్నాళ్లపాటు అదృశ్యం అయ్యారు. ఓ వర్చువల్ సమావేశంలో కనిపించేవరకు, జాక్ మా ఆచూకీపై ఊహాగానాలు వినిపించాయి.

  • Loading...

More Telugu News