nvs prabhakar: రాజన్న రాజ్యమంటే దోచుకోవడం, దాచుకోవడమే: షర్మిల వ్యాఖ్యలపై మండిపడ్డ బీజేపీ నేత
- జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చింది రాజన్న రాజ్యమే
- ఆయన పాలనలోనే అధికారులు కోర్టుల చుట్టూ తిరిగారు
- షర్మిల ప్రసంగం అంతా సీఎం కేసీఆర్ రాసి ఇచ్చిందే
తెలంగాణలో తాను స్థాపించబోయే పార్టీ పేరును జులై 8న ప్రకటిస్తానని నిన్న ఖమ్మం సభలో వైఎస్ షర్మిల అధికారికంగా ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అలాగే, తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ కొన్ని రోజులుగా ఆమె తన తండ్రి వైఎస్సార్ పాలనను ప్రస్తావనకు తెస్తోన్న వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది.
హైదరాబాద్‌లో ఈ రోజు బీజేపీ నేత ఎన్వీఎస్ ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. అసలు రాజన్న రాజ్యమంటే దోచుకోవడం, దాచుకోవడమేనని, జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చింది రాజన్న రాజ్యమేనని విమర్శించారు. ఆయన పాలనలోనే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కోర్టుల చుట్టూ తిరిగారని ఆయన తెలిపారు.
షర్మిల నిన్న ఖమ్మంలో చేసిన ప్రసంగం అంతా సీఎం కేసీఆర్ రాసి ఇచ్చిందేనని ప్రభాకర్ ఆరోపించారు. కరోనా నేపథ్యంలోనూ నాగార్జున సాగర్‌లో టీఆర్ఎస్ లక్ష మందితో సభ నిర్వహిస్తామంటోందని, దానికి ఎలా అనుమతి ఇస్తారని ఆయన నిలదీశారు. కాగా, నిన్నటి సభలో బీజేపీపై కూడా షర్మిల విమర్శలు గుప్పించారు.