Maharashtra: పూర్తి లాక్ డౌన్ పెట్టేద్దామంటున్న మహారాష్ట్ర మంత్రులు!
- వారాంతం లాక్ డౌన్ సరిపోదు
- ఆసుపత్రుల్లో ఆక్సిజన్ నిండుకుంది
- రెమిడీసివిర్ స్టాక్స్ లేవంటున్న మంత్రులు
- పూర్తి లాక్ డౌన్ పెట్టాలని సీఎంకు వినతి
కేవలం వారాంతాల్లో మాత్రమే లాక్ డౌన్ పెడితే, రోజురోజుకూ పెరుగుతున్న కేసులను తగ్గించ లేమని, పూర్తి స్థాయి లాక్ డౌన్ ను పెట్టాల్సిందేనని మహారాష్ట్ర మంత్రులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థను కాపాడాలంటే, కొన్ని రోజులు పూర్తిగా నిబంధనలను అమలు చేయాల్సిందేనని ఆరోగ్య మంత్రి రాజేష్ తోపేతో పాటు మరో మంత్రి విజయ్ వడ్డేటివర్ సీఎం ఉద్ధవ్ థాకరేను కోరారు.
ఇక నేడు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్న సీఎం, కరోనా చైన్ ను బ్రేక్ చేసేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న విషయమై ఆయన చర్చించనున్నారు. ఇదే సమయంలో పూర్తిస్థాయి లాక్ డౌన్ విషయంపైనా చర్చ జరుగనుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
తాను పూర్తి లాక్ డౌన్ కు వ్యతిరేకమేనని, అయితే, ప్రస్తుత పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయని తాజాగా మీడియాతో మాట్లాడిన రాజేష్ తోపే అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో కొత్త కేసులు ఇలాగే పెరుగుతుంటే, ఆసుపత్రుల్లో బెడ్లు కూడా నిండుకుంటాయని, అప్పుడు పూర్తి లాక్ డౌన్ మినహా మరో మార్గం ప్రభుత్వం ముందు ఉండబోదని అన్నారు. అటువంటి పరిస్థితి రాకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.
కనీసం రెండు నుంచి మూడు వారాల పాటు పూర్తి నియమ నిబంధనలను అమలు చేస్తే, కేసులను తగ్గించవచ్చని, ఇదే సమయంలో వైద్య విభాగంలో మౌలిక వసతులను పెంచుకోవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే, ఇప్పటివరకూ అటువంటి పరిస్థితి రాలేదనే తాను భావిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం మహారాష్ట్రలో పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉందని, తక్షణమే లాక్ డౌన్ పెడితేనే మంచిదని మరో మంత్రి విజయ్ వడ్డేటివర్ పేర్కొన్నారు.
ఆసుపత్రుల్లో ఇప్పటికే ఆక్సిజన్ నిండుకుందని, కరోనా చికిత్సకు వాడుతున్న రెమిడీసివిర్ ఔషధం కూడా సరిపడినంత లేదని, ఇదే సమయంలో వ్యాక్సిన్ కొరత కూడా ఏర్పడినందున వచ్చే 10 రోజుల పాటు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. లేకుంటే కేసుల సంఖ్య 10 లక్షలకు చేరుకునే ప్రమాదం ఉందని, ఇదే విషయాన్ని తాను సీఎం దృష్టికి కూడా తీసుకుని వెళ్లానని అన్నారు.