Lockdown: పడిపోతున్న ముడి చమురు ధరలు
- డబ్ల్యూటీఐ ప్రకారం 1.6% తగ్గుదల
- పెరుగుతున్న కేసులు, లాక్ డౌన్ భయాలతో పతనం
- ఇటీవలి కాలంలో 60 డాలర్లు దాటని బ్యారెల్ ధర
- మరింత పతనమవుతాయంటున్న నిపుణులు
ప్రపంచ వ్యాప్తంగా భారీగా పెరిగిపోతున్న కరోనా కేసులు, మరణాలు.. మళ్లీ లాక్ డౌన్ పెడతారన్న భయాల నేపథ్యంలో ముడి చమురు ధరలు భారీగా పతనమవుతున్నాయి. ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న ఆర్థిక వ్యవస్థపై మరోమారు కరోనా మహమ్మారి రూపంలో నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఆ ప్రభావం కాస్తా ముడి చమురు ధరలపై పడుతోందని ఆర్థిక, మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
అంతర్జాతీయ ముడి చమురుకు ప్రామాణికంగా తీసుకునే వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యూటీఐ) ప్రకారం.. అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు 1.6 శాతం పడిపోయాయి. చాలా దేశాల్లో చమురుకు డిమాండ్ పెరుగుతున్నా కూడా ధరలు పతనమవుతున్నాయి. ఇటీవలి కాలంలో బ్యారెల్ ముడి చమురు ధర 60 డాలర్లు (సుమారు రూ.4,500) కూడా దాటలేదు.
అమెరికా, భారత్ వంటి దేశాల్లో ఇప్పటికే డిమాండ్ పెరిగినా.. మార్కెట్ సెంటిమెంట్లు కూడా ముడి చమురు ధరలు పెరగడానికి కారణమైందని నిపుణులు చెబుతున్నారు. అంతేగాకుండా కొన్ని దేశాల్లో లాక్ డౌన్లు విధించిన నేపథ్యంలో.. మరిన్ని దేశాలూ ఆ దిశగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న భయాలూ దానికి ఆజ్యం పోశాయంటున్నారు. కాగా, తాత్కాలిక మందగమనం, మధ్యకాలిక ఆశావహ దృక్పథాల మధ్య హోరాహోరీలో చమురు ధరలు మరింత ప్రభావితం అవుతాయని పీవీఎం ఆయిల్ అసోసియేట్స్ కు చెందిన మార్కెట్ విశ్లేషకుడు తమస్ వర్గ అన్నారు.