sriti hassan: కమల్‌తో కలిసి పోలింగ్ బూత్‌లోకి వెళ్లిన హీరోయిన్ శ్రుతిహాసన్.. ఈసీకి బీజేపీ ఫిర్యాదు
- నిన్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
- ఓ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ లోపలికి వెళ్లిన కమల్
- పార్టీలో పదవి లేకపోయినప్పటికీ లోపలికి వెళ్లిన శ్రుతి
- తన తండ్రి పార్టీకి ఓటు వేయాలని పోలింగ్ రోజు ట్వీట్
నిన్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో కమలహాసన్ మక్కల్ నీది మయ్యం పార్టీ కూడా పోటీ చేసింది. ఇక కమలహాసన్ కోయంబత్తూర్ నుంచి పోటీ చేశారు. ఈ క్రమంలో తాను పోటీ చేస్తున్న కోయంబత్తూర్ దక్షిణ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ లోపలికి కమల్ వెళ్లగా, ఆయన కూతురు, హీరోయిన్ శ్రుతిహాసన్ కూడా ఆయన వెనకే వెళ్లింది.
దీంతో ఈ ఘటన వివాదాస్పదమవుతోంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా శ్రుతిహాసన్ ప్రవర్తించిందని ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ బీజేపీ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. మక్కల్ నీది మయ్యం పదవిలో శ్రుతికి ఎలాంటి పదవీ లేదు. అయినప్పటికీ ఆమెను పోలింగ్ బూత్ లోకి ఎలా అనుమతించారని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాదు, శ్రుతిహాసన్ మరో తప్పు కూడా చేసిందని బీజేపీ నేతలు అంటున్నారు. ఓటు వేసి ఇంటికెళ్లి ‘మక్కల్ నీది మయ్యంకు ఓటు వేయాలని ట్వీట్ చేసిందని ఆరోపిస్తున్నారు. ఇది కూడా ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమని బీజేపీ నేతలు నందకుమార్, వానతి శ్రీనివాస్.. శ్రుతిపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు.