Chhattisgarh: ప్లీజ్‌ నక్సల్‌ అంకుల్,‌ మా నాన్నను వదిలిపెట్టరా...!: సీఆర్పీఎఫ్ జవాన్ రాకేశ్వర్‌ సింగ్ కూతురు ‌విజ్ఞప్తి

Missing Jawan Appeals Naxals to Leave her father by saying plz naxal Uncle

  • ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులతో భీకర పోరు
  • 22 మంది జవాన్ల మృతి.. 31 మందికి తీవ్ర గాయాలు
  • రాకేశ్వర్‌ అనే జవాన్‌ ఇప్పటికీ మావోల అదుపులోనే?
  • సురక్షితంగా వదిలిపెట్టాలని కుటుంబ సభ్యుల విజ్ఞప్తి
  • కంటతడి పెట్టిస్తున్న జవాన్‌ కూతురి విన్నపం

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులతో జరిగిన భీకర పోరులో 22 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. మరో 31 మంది తీవ్రంగా గాయపడ్డారు. రాకేశ్వర్‌ సింగ్‌ మన్హాస్‌ అనే జవాన్‌ ఇప్పటికీ మావోయిస్టుల అదుపులోనే ఉన్నట్లు భావిస్తున్నారు.

అయితే, రాకేశ్వర్‌ సింగ్‌ క్షేమంగా తిరిగి రావాలని యావత్తు భారతదేశం ప్రార్థిస్తోంది. ఈ క్రమంలో కూతురు రాఘవి నక్సలైట్లకు చేసిన విజ్ఞప్తి ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. రాకేశ్వర్‌ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన పాత్రికేయుల ద్వారా ఆమె తన తండ్రిని వదిలిపెట్టాలంటూ మావోయిస్టులకు విజ్ఞప్తి చేసింది.

‘‘నేను పప్పా(నాన్న)ను చాలా మిస్‌ అవుతున్నాను. నాకు పప్పా అంటే ఎంతో ఇష్టం. ప్లీజ్‌ నక్సల్ అంకుల్‌.. మా పప్పాను వదిలేసి ఇంటికి పంపరా’’ అంటూ చిన్నారి రాఘవి చేసిన విజ్ఞప్తి అక్కడ ఉన్నవారందరినీ ఒక్కసారి కంటతడి పెట్టించింది. రాఘవితో పాటు రాకేశ్వర్‌ ఏడేళ్ల మేనల్లుడు సైతం తన మామ కోసం వెతుక్కుంటున్నాడు. ఇంటికి వచ్చిన మీడియా వాళ్లను ‘‘మా మామయ్య ఎక్కడున్నారో మీకు తెలిసే ఉంటుంది కదా’’ అని ప్రశ్నిస్తున్నాడు. ఈ మేరకు ప్రముఖ జాతీయ మీడియా సంస్థ న్యూస్‌18 కథనం ప్రచురించింది.

రాకేశ్వర్‌ భార్య మీనూ మాట్లాడుతూ.. ‘‘ఐదు రోజుల క్రితం నేను మావారితో ఫోన్‌లో మాట్లాడాను. ఆపరేషన్‌కు వెళుతున్నానన్నారు. తిరిగొచ్చిన తర్వాత ఫోన్‌ చేస్తా అని చెప్పారు. మీడియాలో దాడికి సంబంధించిన వార్తలు వినగానే భయంతో ఆయనకు ఫోన్‌ చేశాను. కానీ, అక్కడి నుంచి ఎలాంటి సమాధానం లేదు’’ అంటూ మీనూ కంటతడి పెట్టుకున్నారు.

అయితే, బీజాపూర్‌లోని ఓ స్థానిక రిపోర్టర్‌ ఫోన్‌ చేసి తన భర్త మావోయిస్టుల అదుపులో ఉన్నట్లు చెప్పాడని మీనూ తెలిపారు. ఆయన్ని విడుదల చేయాలంటూ ఓ ఆడియో రికార్డ్‌ చేసి పంపాలని రిపోర్టర్‌ సూచించినట్లు తెలిపారు. భర్త కోసం అతను చెప్పినట్లుగా చేశానన్నారు. అయితే, బీజాపూర్‌లో ఉన్న ఓ వ్యక్తికి తన ఫోన్‌ నెంబర్‌ ఎలా లభ్యమైందని మీనూ ప్రశ్నించారు. దీనిపై వెంటనే విచారణ జరిపించాలని కోరారు.

అలాగే ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌ షా.. తన భర్త సురక్షితంగా తిరిగొచ్చేలా ఏర్పాట్లు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News