Jaya Bachchan: బెంగాలీలను బెదిరించిన వాళ్లెవరూ బాగుపడలేదు: జయాబచ్చన్
- బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు
- అధికార టీఎంసీ తరఫున జయా బచ్చన్ ప్రచారం
- అఖిలేశ్ యాదవ్ ఆదేశాలతో జయా బెంగాల్ పయనం
- మమతా ఒంటరిపోరాటం చేస్తున్నారని వ్యాఖ్య
- అరాచకాలకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నారని వివరణ
రాజ్యసభ సభ్యురాలు, సమాజ్ వాదీ పార్టీ నేత, నటుడు అమితాబ్ బచ్చన్ అర్ధాంగి జయా బచ్చన్ పశ్చిమ బెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు. కోల్ కతాలో ఆమె మాట్లాడుతూ, బెంగాలీలను బెదిరించిన వాళ్లెవరూ బాగుపడలేదని స్పష్టం చేశారు.
బెంగాలీలపై వేధింపులకు పాల్పడి ఏ ఒక్కరూ విజయవంతం కాలేకపోయారని, రాజకీయ పార్టీలు ఈ సంగతి గ్రహించాలని అన్నారు. సీఎం మమతా బెనర్జీ అరాచకాలకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య హక్కుల కోసం ఒంటరి పోరాటం సాగిస్తున్నారని జయ కితాబిచ్చారు. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆదేశాలతోనే తాను పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ తరఫున ప్రచారం చేస్తున్నానని జయా బచ్చన్ వెల్లడించారు.
పశ్చిమ బెంగాల్ లో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మొత్తం 8 విడతల్లో ఎన్నికలు జరగనుండగా, ఇప్పటికే రెండు విడతల ఎన్నికలు పూర్తయ్యాయి.