West Bengal: సీఎం అయి ఉండి.. రెచ్చగొడతారా, మీపై చర్యలు తప్పవు: మమతా బెనర్జీకి ఎన్నికల సంఘం వార్నింగ్​

EC Warns Mamata Over False Allegations

  • అన్నీ అసత్యపు ఆరోపణలని మండిపాటు
  • బూత్ లో ఎవరూ బయటి వారు లేరని వెల్లడి
  • మమత తీరు సరిగ్గా లేదని ఆగ్రహం
  • వ్యాఖ్యలు వేరే రాష్ట్రాల ఎన్నికలనూ ప్రభావితం చేస్తాయని కామెంట్

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. నందిగ్రామ్ నియోజకవర్గంలోని బోయల్ పోలింగ్ కేంద్రంలో అవకతవకలు జరిగాయని, అసలైన ఓటర్లను రానివ్వకుండా బయటి వాళ్లు దొంగ ఓట్లు వేశారని ఆరోపించారు. ఆ వ్యాఖ్యలపై ఈసీ మండిపడింది. ఆమె ఆరోపణలు నిరాధారమని వ్యాఖ్యానించింది. ఏప్రిల్ 1న ఆమె చేసిన వ్యాఖ్యలన్నీ అసత్యాలని పేర్కొంది. ఆదివారం ఈ మేరకు మమతా బెనర్జీకి ఈసీ లేఖ రాసింది.

‘‘పోలింగ్ బూత్ వద్ద మీరు ఎంత హంగామా సృష్టించారో మీడియాలో ప్రసారమైన వీడియోలే చెబుతున్నాయి. బెంగాల్ ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, ఎన్నికల సంఘం, పారామిలటరీ బలగాలపై నోటికొచ్చిన ఆరోపణలు చేశారు. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి.. ఓటర్లను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. మీ పద్ధతితో ఓటర్లు ప్రలోభానికి గురయ్యే ప్రమాదముంది. ఇతర రాష్ట్రాల ఎన్నికలపైనా మీ మాటల ప్రభావం పడే ముప్పుంది. అందుకే ఎన్నికల కోడ్ ఆధారంగా మీపై చర్యలు తీసుకునే విషయంపై నిర్ణయం తీసుకుంటాం. అన్నీ ఆధారాలను పరిశీలించాక.. పోలింగ్ బూత్ వద్ద గూండాలుగానీ, బయటి వ్యక్తులుగానీ ఎవరూ లేరు. ఎవరూ బూత్ లోకి చొరబడలేదు’’ అని ఎన్నికల సంఘం మమతా బెనర్జీని హెచ్చరించింది.    

ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయడం మంచిది కాదన్నారు. నందిగ్రామ్ లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని తెలిపింది. ఓటర్లను అన్ని రకాలుగా చెక్ చేసిన తర్వాతే ఓటేసేందుకు అనుమతించారని పేర్కొంది. బెంగాల్ ప్రత్యేక ఎన్నికల అధికారులు అజయ్ నాయక్, వివేక్ దూబెల నుంచి నివేదిక తెప్పించుకున్నామని, అన్ని వివరాలను పరిశీలించామని, ఎక్కడా అవకతవకలు జరిగినట్టు దాఖాల్లేవని తేల్చి చెప్పింది.

  • Loading...

More Telugu News