Telangana: కరోనా కట్టడికి తెలంగాణ సర్కార్ కొత్త యాప్
- ట్రేసింగ్-టెస్టింగ్-ట్రీటింగ్ ఆధారంగా పనిచేయనున్న యాప్
- తాజా పరిస్థితులపై మంత్రి ఈటెల సుదీర్ఘ సమీక్షా సమావేశం
- తిరిగి పూర్వ స్థితిలో వైద్యారోగ్య వ్యవస్థ పనిచేయనుందని హామీ
- హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి కిట్‌తో పాటు ఫోన్ ద్వారా వైద్యుల సలహాలు
కరోనా కట్టడి కోసం తెలంగాణ వైద్యారోగ్య శాఖ కొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ ఆధారంగా కరోనా నివారణకు ఈ యాప్ దోహదం చేయనుంది. ఓ వ్యక్తికి కరోనా సోకితే.. వారి వివరాలు ఫోన్ నంబర్‌తో సహా ప్రభుత్వ సాఫ్ట్‌వేర్‌లో అప్‌డేట్ చేస్తారు. దీనికి యాప్‌ను అనుసంధానించారు. దీంతో సదరు ఫోన్ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నవారందరికీ ఓ సంక్షిప్త సందేశం వెళ్లేలా యాప్‌ను రూపొందించారు. దీంతో వారు వెంటనే అప్రమత్తమై నిర్ధారణ పరీక్షలు చేయించుకునే అవకాశం ఉంటుంది. దీంతో ఒకరి నుంచి మరొకరికి కరోనా సోకడం ఆగిపోతుంది. కరోనా రెండో వేవ్ విజృంభిస్తున్న తరుణంలో ఈ యాప్ అందుబాటులోకి రావడం గమనార్హం.
రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై నేడు వైద్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా లక్షణాలు ఉన్న వారందరూ నిర్లక్ష్యం చేయకుండా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. అలాగే గతంలో కరోనా చికిత్స అందించిన అన్ని ఆసుపత్రులు తిరిగి పూర్తి స్థాయిలో కరోనా ఆసుపత్రులుగా మార్చాలని నిర్ణయించారు. 33 జిల్లా కేంద్రాల్లోని ఆసుపత్రుల్లో కరోనా వార్డ్స్ ఏర్పాటు చేసి అక్కడే చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
హోం క్వారంటైన్‌లో ఉండేవారికి సలహాలు, సూచనలు ఇవ్వడానికి, వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకోవడానికి ఎస్ఆర్ నగర్‌లో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ పూర్తి స్థాయిలో పని చేయనుందని ఈటెల తెలిపారు. అలాగే ఇంటి దగ్గరే చికిత్స తీసుకుంటున్న వారికి కరోనా మెడికల్ కిట్ అందించడంతో పాటు వారికి టెలిఫోన్ ద్వారా వైద్య సలహాలు ఇవ్వాలని అధికారులకు సూచించారు.