Amit Shah: సీఏఏపై త్వరలోనే నిబంధనలు: తేల్చి చెప్పిన అమిత్ షా
- మహమ్మారితో ఖరారు చేయలేకపోయామని వెల్లడి
- మయన్మార్ అక్రమ వలసలపైనా కామెంట్
- వారి బాధ్యత తమది కాదని తేల్చి చెప్పిన హోం మంత్రి
- దేశానికంటూ సరిహద్దులున్నాయని వెల్లడి
- వారిని రానిస్తే భవిష్యత్ లో దేశ భద్రతకే ముప్పని కామెంట్
ప్రస్తుతం మహమ్మారి విజృంభిస్తుండడంతో పౌరసత్వ సవరణ చట్టంపై విధివిధానాలను ఖరారు చేయలేకపోతున్నామని అమిత్ షా చెప్పారు. 70 ఏళ్ల సమస్యకు ప్రధానిగా రెండో సారి బాధ్యతలు చేపట్టిన వెంటనే నరేంద్ర మోదీ.. పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) తీసుకొచ్చారని గుర్తు చేశారు. ప్రజలకు తమపై నమ్మకముందని, తప్పకుండా సీఏఏ నిబంధనలను త్వరలోనే ఖరారు చేస్తామని, దాని ప్రకారమే పౌరసత్వం ఇస్తామని చెప్పారు. శనివారం ఆయన ఓ ఆంగ్ల చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.
మయన్మార్ శరణార్థులపైనా ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరికీ సాయం చేయాలని తమకూ ఉంటుందన్నారు. వారికి రేషన్, వైద్య సాయం కావాలంటే తప్పకుండా చేస్తామన్నారు. కానీ, ఎట్టిపరిస్థితుల్లోనూ అక్రమ వలసలను ప్రోత్సహించేది లేదన్నారు. వారి బాధ్యత తమది కాదన్నారు. దేశానికంటూ సరిహద్దులున్నాయని, ప్రతి ఒక్కరూ అలాగే దేశంలోకి ప్రవేశిస్తూపోతే.. దేశ భద్రతకే విఘాతం కలిగే ముప్పు ఉంటుందని అన్నారు. ఇప్పటికే మయన్మార్ సర్కార్ కు ఫోన్ చేసి వారి పౌరుల బాధ్యతలు చూసుకోవాల్సిందిగా తేల్చి చెప్పామన్నారు.
దేశ భవిష్యత్ కు బెంగాల్ చాలా కీలకమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఈశాన్య భారత్ కు బెంగాలే ద్వారమని, ఆ రాష్ట్రానికి దేశ సరిహద్దులూ ఉన్నాయని చెప్పారు. అక్కడ జరిగే చొరబాట్లను ఆపలేకపోతే అది దేశానికే పెనుముప్పుగా పరిణమించే ప్రమాదం ఉందన్నారు.
కేంద్ర ప్రభుత్వానికి బెంగాల్ ప్రభుత్వం నుంచి కించిత్ సహకారమూ అందట్లేదన్నారు. ఆ ఫైట్ వల్లే అభివృద్ధిలో బెంగాల్ వెనుకబడుతోందన్నారు. దేశవ్యాప్తంగా కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతి రైతుకూ ఎకరాకు రూ.6 వేలు ఇస్తున్నామని, కానీ, బెంగాల్ ప్రభుత్వం దానిని నిలపుదల చేయడంతో అక్కడ అమలు కావడం లేదని చెప్పారు.
ఒకానొక సమయంలో దేశ జీడీపీలో బెంగాల్ దే సింహ భాగమని, కానీ, ఇప్పుడు అట్టడుగు స్థాయికి దిగజారిందని అన్నారు. నందిగ్రామ్ సీటును ఎంపిక చేసుకున్నప్పుడే.. తన సొంత నియోజకవర్గం భవానీపూర్ నుంచి మమత పారిపోయివచ్చిందని తాను అనుకున్నట్టు చెప్పారు. అయితే, ఆ క్రమంలో నందిగ్రామ్ ను ఎంపిక చేసుకుని మమత పెద్ద తప్పు చేసిందని అమిత్ షా అన్నారు. నందిగ్రామ్ లో 20 వేల ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారే గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.
ప్రతి పార్టీలోనూ అసహన గళాలు ఉండడం సహజమని, తృణమూల్ నేతలు తమ పార్టీలో చేరినప్పుడూ సొంత పార్టీ వారు విమర్శించారని ఆయన చెప్పారు. అయితే, కోపం అనేది ఎక్కడైనా సహజమేనన్నారు. కానీ, బీజేపీలో మాత్రం ఆ తర్వాత అందరూ కలిసిపోతారని చెప్పారు. వారి కోపం పోగొట్టడానికి ‘భారత్ మాతా కీ జై’ అనే ఒక్క నినాదం చాలు అన్నారు.
జై శ్రీరాం అనేది మత నినాదం కాదన్నారు. ఓ వర్గం మెప్పు పొందేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న కపట రాజకీయాల నుంచి పుట్టిందే ఈ నినాదమన్నారు. దేశంలోని మెజారిటీగా ఉన్న హిందువులను సెకండ్ గ్రేడ్ పౌరులుగా మార్చేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలను ఆపేందుకు పుట్టిన నినాదమదని వివరించారు. అయితే, దేశంలో హిందువులుగానీ, ముస్లింలుగానీ రెండో తరగతి పౌరులు కాదన్నారు.
బెంగాల్ లో దుర్గా పూజ చేసుకోవాలంటే హైకోర్టు పర్మిషన్ కావాలా? అని ప్రశ్నించారు. సరస్వతి పూజ చేసుకుంటున్న వారిపై తూటాలు కురిపిస్తారా? అంటూ మండిపడ్డారు. ఇలాంటి రాజకీయాలపైనే జనం ఆగ్రహంగా ఉన్నారు. మే 2న మార్పు అనేది కనిపిస్తుందని చెప్పారు.
అసోంలో జరిగిన ఈవీఎం ఘటన తనకు తెలియదని, అయితే, ఎవరు తప్పు చేసినా వారిని శిక్షించాల్సిందేనని అమిత్ షా అన్నారు. చట్ట ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు.