Motor Vehicle Act: పదే పదే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. ఇకపై ఇజ్జత్ తీస్తారు!
- ఏప్రిల్ 1 నుంచి కొత్త మోటార్ వాహన చట్టం అమల్లోకి
- చెప్పినా వినని ఉల్లంఘనుల పేర్లు వెబ్ సైట్ లో
- డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయనున్న అధికారులు
- వాహన డీలర్ వద్దే ఇక రిజిస్ట్రేషన్లు
- ఆర్టీవోకు వెళ్లాల్సిన పనే లేదు
అరె బాబు.. హెల్మెట్ పెట్టుకోండి అని ఎన్ని సార్లు చెప్పినా వినరు. రాంగ్ రూట్ లో వస్తే డేంజర్ రా బాబు అని చెప్పినా పట్టించుకోరు. అంత స్పీడ్ పనికిరాదు.. కొంచెం తగ్గు అంటే తగ్గరు. తాగి బండి నడిపితే ఇంటికి కాదు.. పైకి పోతార్రా అని చెప్పినా హూహూ...! అబ్బో ఒక్కటేంటి ఎంత మంది.. ఎన్నెన్ని సార్లు..! ఎంత చెప్పినా పట్టించుకోకుండా పదే పదే ట్రాఫిక్ నిబంధనలను గాలికి వదిలేస్తున్నారు చాలా మంది.
అలా మళ్లీ మళ్లీ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే ప్రబుద్ధులకు ఓ వార్నింగ్! ఇక నుంచి ఫైన్లు వేయడమే కాదు.. నలుగురిలో ఇజ్జత్ (పరువు) తీస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా మోటార్ వాహనాల చట్టాన్ని తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. కొత్త చట్టంలో భాగంగా పదే పదే ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారి డ్రైవింగ్ లైసెన్స్ ను రద్దు చేయనున్నారు. అంతేకాదు, వారి పేర్లు అందరికీ తెలిసేలా ఫొటో సహా వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయనున్నారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆ ఆదేశాలు వెళ్లాయి.
ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త చట్టంలోని నిబంధనలను కేంద్ర రోడ్డు రవాణ శాఖ వెల్లడించింది. మార్పులు, చేర్పులు, కొత్త హంగులతో రూపుమార్చుకున్న వాహనాలకూ ఇకపై రిజిస్ట్రేషన్ చేయనున్నారు. అయితే, వాహనంలో మార్పులు చేయడానికి కచ్చితంగా రవాణ శాఖ అధికారుల అనుమతిని మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది. అలా అనుమతి తీసుకుని రూపు మార్చిన వాహనాలకే రిజిస్ట్రేషన్ చేస్తారు. వాటికి బీమా సౌకర్యాన్నీ వర్తింపజేయనున్నారు. ఇంతకుముందు అలాంటి సౌకర్యం లేదు.
పరువు పోతుందన్న భయంతోనైనా పదే పదే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడకుండా ఉంటారన్న ఉద్దేశంతోనే.. ఉల్లంఘనుల పేర్లు, వివరాలను వెబ్ సైట్ లో పెట్టాలని నిర్ణయించినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే, డ్రైవింగ్ లైసెన్స్ రద్దయిన నెల వరకూ అప్పీల్ కు అవకాశం ఇస్తామని, అప్పటికీ వారు అప్పీల్ చేసుకోకపోతే పేర్లను వెబ్ సైట్ లో పెడతామని చెప్పారు. ఇలాంటి ఉల్లంఘన రాయుళ్ల వల్ల వారి ప్రాణాలతో పాటు ఎదుటి వారి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని చెప్పారు.
అన్ని రాష్ట్రాల రవాణ శాఖలు తమ పోర్టళ్లలో ‘డ్రైవింగ్ లైసెన్స్ రద్దు’ అనే ఓ కొత్త ప్రత్యేక సెక్షన్ ను ఏర్పాటు చేస్తాయని చెప్పారు. ఇకనుంచి వినియోగదారులు రవాణ శాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఆన్ లైన్ లోనే అన్నింటికీ అప్లై చేసుకునేలా అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. ఇక, డ్రైవింగ్ లైసెన్స్ కోసం కనీస విద్యార్హత నిబంధననూ కేంద్రం ఇప్పటికే ఎత్తేసిన సంగతి తెలిసిందే. వాహన రిజిస్ట్రేషన్లు కూడా ఆ వాహనాన్ని కొనుగోలు చేసిన డీలర్ వద్దే జరిగేలా కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. దీంతో ఆర్టీవోకు వెళ్లాల్సిన పనిలేకుండానే సులువుగా రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు వీలు చిక్కింది.