COVID19: వృద్ధులకు కొవిడ్ రెండోసారి సోకితే ముప్పు ఎక్కువే!
- ఒకటి కంటే ఎక్కువసార్లు సోకుతున్న కరోనా
- వృద్ధులకు మరింత సులభంగా సోకుతుందన్న పరిశోధకులు
- ఇమ్యూనిటీ హీనత కారణంగా వారిలో తీవ్ర లక్షణాలు
- డెన్మార్క్ పరిశోధకుల అధ్యయనం
కరోనా మహమ్మారి ఒకసారి సోకితే మళ్లీ రాదనుకోవడానికి వీల్లేదని అనేక నిదర్శనాలు చోటు చేసుకున్నాయి. కరోనా పాజిటివ్ వ్యక్తుల్లో ఏర్పడే యాంటీబాడీలు ఎన్నాళ్లు ఉంటాయన్న దానిపై స్పష్టత లేదు. కొందరు వ్యక్తులు ఒకసారి కరోనా బారినపడిన కొన్నినెలలకే మరోసారి కరోనా బాధితుల జాబితాలో చేరుతున్నారు. అయితే, వృద్ధులకు రెండోసారి కరోనా పాజిటివ్ వస్తే మాత్రం ముప్పు అధికం అని నిపుణులు అంటున్నారు.
కరోనా కొత్త వేరియంట్లు వ్యాప్తిలో ఉండడంతో ఒకటి కంటే ఎక్కువసార్లు కరోనా బారినపడే అవకాశాలు ఉన్నాయని, 65 ఏళ్లకు పైబడినవారిలో ఈ పరిణామం విషమ పరిస్థితికి దారితీస్తుందని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి. ఇప్పటికే పలు వ్యాధులతో బాధపడుతూ, వ్యాధినిరోధకశక్తి హీనత కలిగిన వృద్ధులు కరోనా మళ్లీ సోకితే తట్టుకోలేరని డెన్మార్క్ లోని స్టాటెన్స్ సీరమ్ ఇన్ స్టిట్యూట్ పేర్కొంది.
యువత కూడా ఒకటి కంటే ఎక్కువ సార్లు కరోనా బారినపడుతున్న దాఖలాలు ఉన్నాయని, అయితే యువత కంటే ఎక్కువగా వృద్ధులే పదేపదే కరోనా వైరస్ కు గురవుతున్నట్టు డెన్మార్క్ శాస్త్రవేత్తలు వివరించారు. 65 ఏళ్లకు పైబడిన వృద్ధుల్లో కరోనా నుంచి కాపాడుకునే శక్తి 47.1 శాతం మాత్రమేనని, అది కూడా అస్థిరంగా ఉంటుందని వెల్లడించారు. పైగా కాలం గడిచేకొద్దీ వారిలో వ్యాధినిరోధక శక్తి క్షీణిస్తుండడం వంటి అంశాలతో కరోనా వారిపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.